హాట్ టాపిక్: తెలంగాణ వద్దు ఉమ్మడి ఏపీ ముద్దు

Update: 2019-11-24 05:49 GMT
ఊహించని పరిణామం. ప్రత్యేక రాష్ట్రం కోసం దాదాపు అరవై ఏళ్లు పోరాడిన తెలంగాణ ప్రజలు.. తాము పోరాడి సాధించుకున్న తెలంగాణ విషయం లో తీవ్రమైన వేదనతో ఉన్నారా? కేసీఆర్ పాలనతో విసిగిన వారు.. కొత్త నినాదానికి సిద్ధమవుతున్నారా? ఇందుకు ఏపీ ముఖ్యమంత్రి గా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల తో తెలంగాణలోని వివిధ వర్గాలు ఆకర్షితులవుతున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.
తాజాగా తెలంగాణలో ఏపీ సీఎం జగన్ మీద క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. విద్యార్థులతో పాటు.. కొన్ని వర్గాల్లో జగన్ మీద ఆదరణ పెరగటమే కాదు.. చివరకు తెలంగాణ వద్దు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముద్దు అనే వరకూ వెళుతున్న పరిస్థితి. ఊహించటానికి కూడా వీల్లేని రీతిలో తెలంగాణలోని ఒక విద్యార్థి సంఘం తెలంగాణ వద్దు అంటూ భారీ బ్యానర్ ప్రదర్శించి మరీ నిరసన చేపట్టిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ మధ్యన జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ కి ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు దక్కటం.. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే ఎన్నికల హామీలతో పాటు.. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన వరాల్ని ఒక్కొక్కటిగా తీర్చేస్తున్న వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏ ప్రభుత్వం పెద్దగా ఫోకస్ చేయని అంశాల మీద జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు యువతకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

ఏపీలో వాలంటీర్లు.. సచివాలయ ఉద్యోగుల పేరు తో కేవలం రెండు నెలల వ్యవధిలోనే నాలుగు లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వటం ఒక సంచలనంగా మారింది. మరోవైపు ఉద్యోగాల భర్తీ విషయంలోనూ జగన్ సర్కారు సానుకూలంగా స్పందిస్తోంది. దీంతో.. తెలంగాణలోని విద్యార్థులు జగన్ పాలనకు ఆకర్షితులవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు తెర మీద కు తెచ్చిన విలీనం కాస్తా సమ్మె వరకూ వెళ్లటమే కాదు.. చివరకు విషయం ఎక్కడి వరకూ వెళ్లిందన్నది అందరికి తెలిసిందే.

సంక్షేమ పథకాలు.. వివిధ వర్గాల వారికి మేలు చేసేందుకు జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్రం లో ఆయన మీద క్రేజ్ ను అంతకంతకూ పెంచుతున్నాయి. తాజాగా పశు వైద్య విద్యార్థుల సంఘం నిర్వహించిన ఒక నిరసనలో ప్రదర్శించిన బ్యానర్ ఇప్పుడు సంచలనంగా మారింది.

తెలంగాణ వద్దు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముద్దు అనే నినాదం కొత్త చర్చ కు తెర తీసింది. ఏపీలో ముఖ్యమంత్రి ఉద్యోగాల భర్తీ వాయు వేగం తో చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం ఉద్యోగాల కల్పన ఊసే లేని రీతిలో ఉండటం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన కోసం ఏ విద్యార్థులైతే తీవ్రంగా ఉద్యమం చేశారో.. ఇప్పుడు అదే వర్గంలోని వారు జగన్ ప్రభుత్వం పట్ల క్రేజ్ ప్రదర్శించటమే కాదు.. తెలంగాణ వద్దంటూ బ్యానర్లతో నిరసనలకు దిగే వరకూ వెళ్లటం కొత్త పరిణామంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News