ఏపీలో చిరిగి పోతున్న రేషన్ కార్డ్స్!

Update: 2019-08-10 09:55 GMT
ఏపీలో రేషన్ కార్డ్స్ వడపోతలో కొన్ని అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయని వార్తలు వస్తున్నాయి. అనర్హులకు వైట్ రేషన్ కార్డ్స్ ను రద్దు చేయడంలో అధికారుల అత్యుత్సాహం వివాదాలకు దారి తీస్తూ ఉంది. కొందరి రేషన్ కార్డులను అసంబద్ధంగా రద్దు చేస్తూ ఉన్నారని సమాచారం. ఈ విషయంలో రేషన్ కార్డులను కోల్పోయిన  వారి నుంచి ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది.

ఈ రోజుల్లో ఏ సంక్షేమ పథకం అందాలన్నా రేషన్ కార్డు తప్పని సరి అనే సంగతి వేరే చెప్పనక్కర్లేదు. అలాంటి రేషన్ కార్డును పేదలు ప్రాణప్రదంగా చూసుకుంటున్నారు. అదే  సమయంలో కొంత మేర అనర్హుల వద్ద కూడా వైట్ రేషన్ కార్డులు ఉంటాయి. వాటిని వడపోయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఈ విషయంలో అధికారులు అత్యుత్సాహం చూపుతూ ఉన్నారని, అనేక మంది అర్హుల రేషన్ కార్డులు  కూడా తొలగించారని.. తెలుస్తోంది.

ఈ విషయంలో రేషన్ కార్డు దారుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది.  తమ రేషన్ కార్డులను బ్లాక్ చేశారంటూ వారు వాపోతూ ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొనాల్సి  వస్తోంది. ఏవో సాకులు చూపి అర్హుల రేషన్ కార్డులను  కూడా రద్దు  చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై అధికారులు స్పందిస్తున్నారు.

సాంకేతిక కారణాలతో కొన్ని కార్డులు బ్లాక్ అయ్యాయని వారు అంటున్నారు.  ఇందుకు సంబంధించి దిద్దుబాటు చర్యలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే బ్లాక్ లిస్టులో పెట్టిన కార్డులకు కూడా  ఆగస్టు నెలలో రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏ కార్డు కూడా బ్లాక్ అయినట్టు కాదని, అన్ని కార్డులకూ ఆగస్టులో రేషన్ ఇచ్చి ఆ తర్వాత బ్లాక్ లిస్టు నుంచి అన్నింటినీ తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయని సమాచారం. మరోవైపు  త్వరలోనే నూతన రేషన్ కార్డుల జారీకి కూడా వైఎస్ జగన్ మోహన్  రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  

    
    
    

Tags:    

Similar News