కొత్త ప‌థ‌కాలు-న‌దుల అనుసంధానం.. కొత్త బ‌డ్జెట్‌లో కీల‌క ప్ర‌క‌ట‌న‌

Update: 2022-02-01 08:30 GMT
2022-23 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. తాజాగా పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెట్టారు. ప‌లు కొత్త ప‌థ‌కాలకు ఈ బ‌డ్జెట్‌లో శ్రీకారం చుట్టారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు కూడా పీఎం ఆవాస్ యోజ‌న ద్వారా ఇళ్లు నిర్మించేందుకు సిద్ధ‌మ‌ని చెప్పారు. అదేస‌మ‌యంలో మ‌హిళ‌లు, యువ‌త‌ను ప్రోత్స‌హించేందుకు కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్టు చెప్పారు. కీల‌క‌మైన న‌దుల అనుసందానానికి.. 3 డీపీఆర్‌లు సిద్ధం చేసిన‌ట్టు చెప్పారు. వచ్చే 25 ఏళ్ల అమృతకాలానికి ఈ బడ్జెట్‌ పునాద‌ని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది ప‌లికింద‌న్నారు. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం లభిస్తుంద‌ని నిర్మ‌ల చెప్పారు.  గృహనిర్మాణం, వసతుల కల్పన, తాగునీరు కల్పనలో దేశం వేగంగా ముందుకెళ్తోందన్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌ పరుగు ప్రారంభమైందని, వచ్చే 25 ఏళ్లు భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామ‌ని చెప్పారు.

కొవిడ్‌ కట్టడిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం బాగా కలిసొచ్చిందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో టీకా కీలకపాత్ర పోషించిందన్నారు. ఈ అమృతకాల బడ్జెట్‌ యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీలకు గొప్ప ఊతమివ్వబోతోంద‌ని నిర్మ‌ల పేర్కొన్నారు..

ఉత్పత్తి ఆర్థిక‌ ప్రోత్సాహకాలు 14 రంగాల్లో మంచి అభివృద్ధి కనిపించిందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామ‌న్నారు. నీలాంచల్‌ ఇస్పా‌త్ నిగమ్‌ లిమిటెడ్‌ను ప్రైవేటుపరం చేశామ‌ని తెలిపారు. త్వరలో ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ రాబోతుందని వెల్ల‌డించారు. నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్‌ను రూపొందిచిన‌ట్టు నిర్మ‌ల వివ‌రించారు. ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, ఉత్పాదక అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం అనే నాలుగు అంశాల ఆధారంగా.. బ‌డ్జెట్‌ను రూపొందించామ‌న్నారు.
Tags:    

Similar News