తెలంగాణ లీడ‌ర్ల‌కు కొత్త టెన్ష‌న్ మొద‌లైంది

Update: 2017-12-12 17:30 GMT
తెలంగాణలోని అధికార ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. రెండు వ‌ర్గాల‌కు ఒకే ర‌క‌మైన స‌మస్య కావ‌డం విశేషం. ఇదంతా టెక్నాల‌జీ పుణ్య‌మే కావ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే..ఒకప్పుడు ఎక్కడ  ఏం జరిగినా అది బయటికి వచ్చేందుకు చాలా రోజులు పట్టేది. ఇంకొన్ని సార్లు.. అసలు విషయం బయటికి కూడా రాని సందర్భాలు ఎన్నో. కానీ రోజులు మారాయి. టెక్నాలజీ పెరిగిపోవడంతో ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో ప్రపంచం మొత్తం తెలిసిపోతోంది. ఇక స్మార్ట్ ఫోన్లు లీడర్లకు పెద్ద తలనొప్పిగా మారాయి. మంచికో  చెడుకో ఏం మాట్లాడినా అది గంటల్లోనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది. జనం సమస్యలపై అధికారులతోనో… ఇతర నాయకులతోనో కొంచెం టంగ్ స్లిప్పయి మాట్లాడితే అంతే సంగతులు. అలా ఫోన్ పెట్టేస్తామో లేదో ఇలా వాట్స్ యాప్ గ్రూప్‌ల‌తో పాటు  ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాల్లో హల్ చల్ అవుతోంది.

తెలంగాణ‌లో ఇప్పటికే పార్టీలకతీతంగా చాలామంది నేతలు ఫోన్ వాయిస్ రికార్డింగ్ లో ఇరుక్కున్నారు. అధికార‌ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బాబుమోహన్ , ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బొడిగ శోభ , ఎమ్మెల్సీ భానుప్రసాద్ వంటి నేతల వీడియో రికార్డింగ్ లు బయటొచ్చాయి. తాజాగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఓ అధికారితో ఫోన్లో మాట్లాడిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చుకున్నా కాల్ రికార్డింగ్ ప్రచారం మాత్రం ఆగడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కరెంట్ లైన్‌మెన్ కు కాల్ చేసి బుక్కయ్యారు. ఈ వ్యవహారంతో అయిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునేందుకు రామ్మోహన్ రెడ్డి నానా తిప్పలు పడ్డారు.

ఈ ప‌రిణామాల‌పై ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ స‌న్నిహితుల‌తో వాపోతున్నారు. నియోజకవర్గ పనుల్లో  భాగంగా ఎమ్మెల్యేలు చాలా ఫోన్లు మాట్లాడుతుంటామ‌ని...అయితే అవే ఫోన్లు త‌మ‌ను ఇరకాటంలో పడేస్తున్నాయని అంట‌న్నారు.  స్మార్ట్ ఫోన్ లు అందుబాటులోకి వచ్చాక వాటిలో ప్రతీ కాల్ రికార్డ్ ఆప్షన్ ఉంటుంది. మాట్లాడుతున్న సందర్భంలో ఏమాత్రం అన్ పార్ల మెంటరీ మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోందంటున్నారు. ఫోన్ రికార్డుల తో ఇమేజ్ డ్యామేజ్ అవుతుండడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. తాము ఒకటి మాట్లాడితే దాన్ని వక్రీకరించి కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు.

మ‌రోవైపు ఇది పార్టీల వార్‌గా మారిపోయింది. ఆడియో, వీడియో రికార్డింగుల్లో అధికార పార్టీ నేతలే బుక్ అయితున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. అధికారం ఉందని పరిధి దాటి మాట్లాడటంతోనే వివాదాల్లో ఇరుక్కుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఏ పార్టీ నేత లైనా జాగ్రత్తగా మాట్లాడితే మంచిదంటున్నారు. సోషల్ మీడియా పుణ్యామాని ఏం మాట్లాడలన్నా ఆచితూచి వ్యవహరిస్తున్నారు ప్రజాప్రతినిధులు. సమస్యలను పరిష్కరించే సమయంలో అధికారులు ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే ప్రజాప్రతినిధులు నోరు జారాల్సి వస్తుందే తప్ప కావాలని ఎవరూ అలా మాట్లాడరని  నేతలు అంటున్నారు. ప్రజాప్రతినిధులుగా ఒత్తిడిలో ఉన్న ప్పుడు… మాట్లాడిన మాటలను హైలెట్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
Tags:    

Similar News