షాకింగ్.. హైద‌రాబాద్‌లో వెలుగుచూసిన‌ కొత్త ర‌కం సైబ‌ర్ దాడులు!

Update: 2022-10-12 05:33 GMT
ఒక‌ప్పుడు వ్య‌వ‌స్థ‌ల‌ను, సంస్థ‌ల‌ను, వ్య‌క్తుల‌ను, దేశాల‌ను దెబ్బ‌తీయ‌డానికి యుద్ధాలు, భౌతిక దాడులు జ‌రిగేవి. అయితే ఇప్పుడు ఆధునిక సాంకేతిక‌త పెర‌గ‌డంతో మ‌నుషుల ఆలోచ‌న‌లు కూడా మారిపోయాయి. టెక్నాల‌జీని ఉప‌యోగించుకునే త‌మ ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ‌తీయడం చేస్తున్నారు. సైబ‌ర్ దాడుల‌తో ఆయా దేశాల వ్య‌వ‌స్థ‌ల‌ను కుప్ప‌కూలుస్తున్నారు. అలాగే ప్ర‌ఖ్యాత సంస్థ‌ల‌పైన సైబ‌ర్ దాడులు చేసి రూ.వేల కోట్ల రూపాయ‌ల న‌ష్టం చేకూరుస్తున్నారు.

ఇలాగే ఇప్పుడు హైద‌రాబాద్‌లోనూ ఇలాంటి సైబ‌ర్ దాడే జ‌రిగింది. అయితే ఇది కొత్త ర‌కం సైబ‌ర్ దాడి కావ‌డం గ‌మనార్హం. సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగులే దాన్ని చేజిక్కుంచుకోవ‌డానికి సొంత సంస్థ‌పైనే సైబ‌ర్ దాడుల‌కు తెగించారు.

వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీ హాంగర్‌ టెక్నాలజీ సంస్థపై సైబర్‌ దాడులు జరిగాయ‌ని తెలుస్తోంది. కంపెనీపై సైబర్‌ దాడి చేసిన కంపెనీ ఉద్యోగులు విలువైన‌ డేటాను చేజిక్కించుకున్నారు. కాగా, గత కొన్నేళ్లుగా కంపెనీలోని ఉద్యోగులే ఈ  సైబర్ దాడులు చేస్తున్న‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డి అయ్యింద‌ని అంటున్నారు.

తాము ప‌నిచేస్తున్న కంపెనీనే చేజిక్కించుకునేందుకు కంపెనీలోని కొంత‌మంది ఉద్యోగులు బ‌య‌టి వ్య‌క్తుల‌తో చేతులు కలిపారు. ఈ క్ర‌మంలో పనిచేస్తున్న కంపెనీపైనే ఉద్యోగులు సైబర్ దాడులు చేశారు. ఈ క్ర‌మంలో కేటుగాళ్లు కంపెనీకి చెందిన విలువైన స‌మాచారాన్ని అప‌హ‌రించారు.

ఈ సైబ‌ర్ దాడుల‌ను గుర్తించిన హాంగర్ టెక్నాల‌జీ కంపెనీ సైబ‌ర్ క్రైమ్‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.  దీంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచార‌ణ చేస్తున్నారు. కంపెనీ ఫిర్యాదు మేర‌కు  ఉద్యోగులు విజయ్‌కుమార్‌, కరణ్‌కుమార్‌, అశ్వంత్‌కుమార్‌లను అరెస్ట్‌ చేశారు. కాగా, నిందితుల ద‌గ్గ‌ర‌ రివాల్వర్‌తో పాటు 10 బుల్లెట్లు కూడా ల‌భించడం గ‌మ‌నార్హం. అమెరికాలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీచేశారు.

సొంత కంపెనీపైనే ఉద్యోగుల సైబ‌ర్ దాడులు సైబ‌రాబాద్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. కంపెనీలు త‌మ భ‌ద్ర‌త‌కు మ‌రిన్ని సుర‌క్షిత చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ఈ ఘ‌ట‌న నిరూపించింది. చివ‌ర‌కు సైబర్ దాడుల శ‌త్రు దేశాలు, ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌ నుంచే కాకుండా సొంత కంపెనీ ఉద్యోగుల నుంచి కూడా త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని తేట‌తెల్ల‌మైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News