డిగ్గీరాజా క‌ష్టం ఎవ‌రికి వ‌ద్దంతే

Update: 2015-07-02 13:04 GMT
కాంగ్రెస్ పార్టీ అధినాయ‌క‌త్వానికి అత్యంత స‌న్నిహితంగా ఉండే నేత‌ల్లో దిగ్విజ‌య్ సింగ్ ఒక‌రు. అత్యంత విధేయ‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తూ గాంధీ ఫ్యామిలీకి కావ‌లి కాసే దిగ్విజ‌య్ టైం ఏమాత్రం బాగున్న‌ట్లు లేదు.

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియ‌ర్ అయిన డి శ్రీ‌నివాస్ తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పేసి.. టీఆర్ ఎస్ లో చేరేందుకు స‌మాయుత్తం కావ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ ను వీడిపోతున్న నేప‌థ్యంలో.. ఎవ‌రి మీదా ప‌రుషంగా మాట్లాడ‌ని ఆయ‌న‌.. డిగ్గీరాజా మీద మాత్రం తీవ్ర‌స్థాయిలో మండి ప‌డ‌ట‌మే కాదు.. ఆయ‌న్ను ఒక లోఫ‌ర్‌గా వ్యాఖ్యానించారు.

డి శ్రీ‌నివాస్ లాంటి సీనియ‌ర్ నేత డిగ్గీరాజాను లోఫ‌ర్‌గా అభివ‌ర్ణించ‌టం ఒక అవ‌మాన‌మైతే.. మ‌రోక‌టి మాత్రం ఆయ‌న‌కు శ‌రాఘాతంగా మారింది. న్యూయార్క్ టైమ్స్ లో ప్ర‌చురిత‌మైన ఆయ‌న ఫోటో ఆయ‌నకు సంబంధించి స‌రికొత్త చ‌ర్చ‌ను షురూ చేయ‌ట‌మే కాదు.. సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం అవుతోంది. ఆడ‌పిల్ల‌ల్ని ప్రోత్స‌హించేందుకు ఇటీవ‌ల బేటీ బ‌చావో కార్య‌క్ర‌మం గురించి స‌రికొత్త  పిలుపు ఇచ్చారు. త‌మ కుమార్తెల‌తో క‌లిసి తండ్రులు ఫోటోలు పోస్ట్ చేయ‌మ‌ని కోర‌టం..దీనికి పెద్దఎత్తున స్పంద‌న తెలిసిందే.

ఈ కార్య‌క్ర‌మంపై ప్ర‌ముఖ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ఒక పీచ‌ర్ వేస్తూ.. అందులో కొన్ని ఫోటోల్ని ప్ర‌చురించింది. ఇందులో పొర‌పాటున డిగ్గారాజాకు సంబంధించిన ఫోటోను ప్ర‌చురించింది. ఆయ‌న ప్రియురాలు.. జ‌ర్న‌లిస్టు అయిన అమృత‌రాయితో దిగిన ఫోటోను.. డిగ్గీరాజా కుమార్తెగా ప్ర‌చురించటం జ‌రిగింది. డిగ్గీ కంటే చాలా చిన్న వ‌య‌స్కురాలైన ఫోటోను చూసి పొర‌పాటు ప‌డ్డ న్యూయార్క్ టైమ్స్ త‌ప్పుగా ప్ర‌చురించింది. దీనికి సంబంధించిన లింక్‌ పెద్దఎత్తున సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ప్రియురాలిని.. కుమార్తెగా త‌ప్పుగా ప్ర‌చారం చేయ‌టం చూసిన‌ప్పుడు ఇలాంటి క‌ష్టం ప‌గోడికి రాకూడ‌దంటూ కొంద‌రు వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News