చికిత్స అందించండంటూ సోనూసూద్ కు భార్యా బాధితుడి ట్వీట్

Update: 2022-04-13 12:30 GMT
కోవిడ్ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. అప్పటి నుంచి ఆయనను మంచి మనసున్న సినీ నటుడిగా అందరూ కొలుస్తున్నారు. దేశంలో రియల్ హీరో అని పిలుస్తున్నారు.ఇక అడిగిందే ఆలస్యం సోషల్ మీడియాలో ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నాడు సోనూసూద్. ఆరోగ్యం బాగాలేదన్నా.. సర్జరీలు కావాల్సిన వారున్నా.. ఆర్థిక పరిస్థితి బాగోలేదని దృష్టికి వచ్చినా ముందుండి సాయం చేస్తున్నారు.

తాజాగా ఓ బాలుడికి సోనూ ఫౌండేషన్ ద్వారా హార్ట్ సర్జరీ జరిగిందని.. ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడని కుటుంబ సభ్యులు సోనూసూద్ కు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కల్లోలంలో అయితే ఆపద్భాంధవుడిగా మారి సోనూసూద్ చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు.

ఇది చూసిన ఓ నెటిజన్ తనను తాను భార్యా బాధితుడిగా పేర్కొంటూ తనకూ కూడా ట్రీట్ మెంట్ అవసరం అంటూ ఫన్నీ ట్వీట్ చేశాడు. దీనికి సోనూసూద్ ను ట్యాగ్ చేశాడు. ‘సోదరా సోనూసూద్.. మీరు అందరికీ చికిత్స అందేలా చేస్తున్నారు. నా భార్య నా రక్తం ఎక్కువగా తాగుతోంది. దానికి ఏదైనా చికిత్స ఉందా? ఉంటే దయచేసి సహాయం చేయండి సోదరా.. ఒక భార్యా బాధితుడిగా చేతులు జోడించి మిమ్మల్ని సహాయం కోసం అడుగుతున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు.

దీనికి సోనూసూద్ కూడా ఫన్నీగానే స్పందించాడు. ‘అది ప్రతీ భార్య జన్మహక్కు బ్రదర్.. మీరు కూడా నాలాగా అదే రక్తంతో బ్లడ్ బ్యాంక్ ప్రారంభించండి’ అంటూ నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశాడు.

ఇలా సీరియస్ విషయాలపైనే కాదు.. కామెడీ విషయాల్లోనూ సోనూసూద్ ఫన్నీగా స్పందిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
Tags:    

Similar News