కల్యాణం తంతునానేనా.. ఈ వేసవిలో గట్టి మేళమే.

Update: 2022-03-31 16:30 GMT
భారత్ లో ఎండాకాలం అంటే.. పెళ్లిళ్ల హడావుడి అంతా ఇంతా కాదు. మేళతాళాలు.. పందిళ్లు.. బంధుమిత్రుల సందళ్లు.. మల్లెల ఘుమఘుమలు.. ఆ హడావుడే వేరు..కానీ, పాడు కరోనా సరిగ్గా గత రెండు వేసవి సీజన్ లను దెబ్బకొట్టింది. సరిగ్గా 2020 వేసవి సీజన్ తో మొదలైన కరోనా.. ఈ ఏడాది జనవరి వరకు కొనసాగింది. 2020 మార్చి 23 నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ తో దేశ ఆర్థిక,సామాజిక వ్యవస్థే కుదేలైంది.

ఇక 2021 వేసవిలో సెకండ్ వేవ్ రావడం.. అందులోనూ అత్యంత ప్రమాదకర డెల్టా వేరియంట్ కారణంగా  పెద్దఎత్తున మరణాలు సంభవించాయి. కొన్ని కార్యక్రమాలు వివాహాలు జరిగినా.. లాక్ డౌన్, జనం హాజరుపైనా ఆంక్షలు తప్పలేదు. దీంతో గతేడాది వేసవి సైతం కళ తప్పింది. అయితే, ఈసారి మాత్రం వేసవి పెళ్లి కళ సంతరించుకోనుంది.

పెళ్లి కళ రానుందే బాలా..

కుటుంబాల్లో విషాదాలు, ఆర్థిక వెసులుబాటు లేకపోవడం, కొవిడ్ తో లేనిపోని ఇబ్బందులు ఎందుకని భావించడంతో రెండేళ్లుగా వివాహాలు కొంత తగ్గాయి. దీనికితోడు లాక్ డౌన్ ఆంక్షలు ఉండడంతో చాలామంది వాయిదాలు వేసుకున్నారు. అలాంటివారందరికీ ఇప్పుడు కాస్త వెసులుబాటు దొరికింది.

దీంతో పాటు ఈ రెండేళ్లలో వివాహ వయసుకు వచ్చినవారూ పెళ్లిళ్లకు సిద్ధమవనున్నారు. అన్నిటికీ మించి దేశంలో నాలుగో వేవ్ ఆందోళనలు కానీ.. లాక్డౌన్ భయం కానీ లేదు. దీంతో వివాహాలకు అడ్డంకులు లేవు. అంతర్జాతీయ విమాన సర్వీసులు సహా కొవిడ్ ఆంక్షలన్నీ తొలగుతున్నాయి. రెండేళ్ల ముందటి నాటి భారత్ మళ్లీ కళ్లకు కడుతోంది.

ఈ నేపథ్యంలో వివాహాలు ఘనంగా జరుపుకొనే అవకాశం కనిపిస్తోంది. కొవిడ్ టీకా పంపిణీ పెద్దఎత్తున జరగడం, బూస్టర్ డోసు కూడా అందరికీ ఇచ్చే ఆలోచన సాగుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చూస్తే.. ఈ వేసవి సీజన్ లో 40 లక్షల పెళ్లిళ్లు.. రూ.5 లక్షల కోట్ల లావాదేవీలు జరుగనున్నట్లు ఓ అధ్యయన నివేదిక చెబుతోంది. ఇందులో అధిక భాగం దేశ రాజధాని వాటానే. ఈ వివాహాలను రూ.2 లక్షలు, రూ.5లక్షలు, రూ.10 లక్షల వ్యయం కేటగిరీలో విభజించారు. రూ.2 లక్షల ఖర్చు జాబితాలోనే అధిక పెళ్లిళ్లు జరుగనున్నాయి.
Tags:    

Similar News