విశాఖ ఉక్కు ఓఎల్ఎక్స్‌ లో అమ్మేయండి బాస్ !

Update: 2022-03-24 07:36 GMT
రైతుల త్యాగం కేంద్రానికి ప‌ట్ట‌దు..భూములు ఇచ్చి ఆ రోజు ప్లాంటు నిర్మాణం కోసం ఎంతో స‌హ‌క‌రించిన రైతుల త్యాగం కేంద్రం ప‌ట్టించుకోదు స‌రి క‌దా! తాను అనుకున్న‌దేదో చేస్తుంది. అందుకు స‌వాల‌క్ష కార‌ణాలు చెబుతూ పోతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున రేప‌టి వేళ అసెంబ్లీ తీర్మానం పంపినా కూడా కేంద్రం వినిపించుకోదు కూడా! ఈ ద‌శ‌లో ప్లాంటు అమ్మ‌కానికి సంబంధించి ఓ వైపు నోటిఫికేష‌న్లు జారీ చేస్తూ..మ‌రోవైపు న‌ష్టాల‌ను సాకుగా పార్ల‌మెంట్ వేదిక‌గా చూపుతూ ఆంధ్రుల‌పై మ‌రోసారి వివ‌క్ష చూపుతోంది.

విశాఖ ఉక్కు కు సంబంధించి చాలా రోజుల నుంచి న‌డుస్తున్న వివాదం నిన్న‌టి వేళ పార్లమెంట్ లోనూ వినిపించింది. ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ ను వ్య‌తిరేకిస్తూ వేల మంది రోడ్డెక్కి నిర‌స‌న చేస్తున్న వైనాన్ని కేంద్రం గుర్తించ‌డం లేదు అన్న ఆవేద‌నను యువ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు కింజ‌రాపు స‌భ దృష్టికి తీసుకునివెళ్లారు. క్యాప్టివ్ మైన్స్ లేని కారణంగానే ప్లాంట్ న‌ష్టాల్లో ఇరుక్కుపోయింద‌ని ఎంపీ రాము ఆవేద‌న చెందారు.

క్యాప్టివ్ మైన్స్ ను కేటాయించాల‌ని పార్లమెంట్ స్థాయీ సంఘం సూచించినా కూడా కేంద్రం ప‌ట్టించుకోలేద‌ని వాపోయారు. ఇదే స‌భ‌లో ఉన్న రాజంపేట ఎంపీ, వైసీపీ ఫ్లోర్ లీడ‌ర్ మిథున్ రెడ్డి కూడా మాట్లాడారు. ఏడువేల కోట్ల రూపాయ‌ల మేర వ‌డ్డీ భారం ప్లాంటు మోయాల్సి వ‌స్తోంద‌ని, ఆయ‌న కూడా క్యాప్టివ్ మైన్స్ లేని కార‌ణంగానే ప్లాంటుకు ఈ రోజు ఇన్ని క‌ష్టాలు వ‌చ్చి ప‌డ్డాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. రుణాల‌పై 14శాతం వ‌డ్డీ చెల్లించాల్సి వ‌స్తుంద‌ని ఇంత‌టి రుణ‌భారం మోయ‌లేకే సంస్థ న‌ష్టాల దిశ‌గా మ‌ళ్లింద‌ని ఆవేద‌న చెందారు.

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని కూడా ఇదే విష‌య‌మై మాట్లాడి కేంద్రాన్ని నిల‌దీశారు. 16500 మంది రైతుల త్యాగం ఏమ‌యిపోవాల‌ని ఎంపీ రామూ నిల‌దీసిన విధంగానే నాని కూడా మాట్లాడారు. లాభాల్లోకి తీసుకువచ్చేందుకు వీలున్న పరిశ్ర‌మ‌ను ఎందుకు ప్ర‌యివేటీక‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇప్ప‌టికే ఉద్యోగాలు కోల్పోతామ‌న్న ఆందోళ‌న‌లో కార్మికులు ఉన్నార‌ని, వారికో ఏ విధంగా భ‌రోసా ఇచ్చి ఆదుకుంటారో చెప్పాల‌ని అటు టీడీపీ ఇటు వైసీపీ డిమాండ్ చేసింది. కానీ కేంద్రం మాత్రం పాత పాడే పాడింది. ఇర‌వై వేల కోట్ల రూపాయ‌ల అప్పు, ఏడు వేల కోట్ల రూపాయ‌ల వ‌డ్డీ కార‌ణంగానే విశాఖ ప్లాంటును అమ్మేయాల‌ని అనుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేసింది. అంటే ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ అమ్మ‌కంలో ఎటువంటి వెనక‌డుగూ లేద‌న్న‌ది నిర్థార‌ణ అయింది. ప్ర‌జా ఉద్య‌మాలంటే కేంద్రానికి మరీ! ఇంత చిన్న చూపా !  మేలుకో ఆంధ్రుడా ! మేలుకో !
Tags:    

Similar News