ఒకే రోజు మంత్రిగా...మాజీగా.. ?

Update: 2022-04-07 06:41 GMT
ఇది చిత్ర విచిత్రమైన పరిస్థితి. ప్రత్యేకించి రాజకీయాల్లో ఉన్న వారికి ఇలాంటి అనుభవాలు ఉన్నప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులకు మాత్రం ఇది అరుదైన సందర్భంగానే చూడాలి. మంత్రిగా క్యాబినేట్ మీటింగునకు అధికార హోదాలో బుగ్గ కార్లలో వెళ్తారు. తిరిగి వచ్చేటపుడు మాత్రం మాజీలుగా మారుతారు. తమ సొంత వాహనాల్లో వారి ఇళ్ళకు వెళ్లాల్సి ఉంటుంది.

ఒక్క రోజు, కొద్ది గంటల తేడాలో మంత్రులు మాజీలు అవుతారు. అధికారం చేతిలో నుంచి జారిపోతుంది. ఇది నిజంగా ఉద్విగ్నమైన క్షణాలుగా మంత్రులు అందరూ భావిస్తున్నారు. అంతా కలసి దాదాపుగా మూడేళ్ళ పాటు మంత్రులుగా పనిచేశారు. అధికారాలను చలాయించారు. జగన్ నాడు చెప్పిన మాట నిజమే. సగం పాలన తరువాత పదవులు పోతాయని అందరికీ తెలుసు. కానీ ఆ క్షణాలు దగ్గరపడేసరికి మాత్రం ఏదో తెలియని బాధ అందరిలోనూ కలుగుతోంది. కనిపిస్తోంది కూడా.

ఇక మంత్రులు అంతా పదవి పోవడం మీద లైట్ తీసుకుంటున్నట్లుగా బయటకు చెబుతున్నా మనసులో మాత్రం ఆవేదన మాటలలో తెలిసిపోతోంది. ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ముందే చెప్పారు కాబట్టి తమ పదవులు పోతాయని తెలుసు అన్నారు.

అయినా తనకు పదవుల మీద వ్యామోహం లేదని, ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా తనను సీఎం జగన్ చేయడం ఆనందంగానే ఉందని చెప్పుకున్నారు. తనకు కాకపోయినా తమ్ముడు ప్రసాదరావుకు మంత్రి పదవి దక్కుతుందన్న ఆశ ఉందని అన్న్నారు. తన తమ్ముడు సమర్ధుడు అని కూడా పేర్కొన్నారు.

ఇక చిత్తూరు జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అయితే జగన్ వల్లనే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని, పదవులు పోతున్నాయన్న బెంగ అసలు లేదని అన్నారు. ఒక  కూలీ కడుపున పుట్టిన తాను ఈ స్థాయికి వచ్చాను అంటే నాడు వైఎస్సార్, నేడు జగన్ వల్లనే అని ఆయన చెప్పుకున్నారు. మొత్తానికి ఆయన ముఖంలో కూడా బాధ కనిపిస్తోంది. కానీ సీఎం మాటే తమకు శాసనం అని ఆయన చెప్పారు. ఇదే వరసలో మిగిలిన మంత్రులు కూడా ఉన్నారు.

జగన్ రాజకీయ  లెక్కలు మొదట్లో అర్ధమైనట్లుగా ఉన్నా ఇక ఆ తరువాత  అర్ధం కాక చివరికి అంతా అవుట్ అన్న అంచనాకు వచ్చాక‌ చాలా మంది మంత్రులు  పరేషాన్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఏపీ రాజకీయ చరిత్రలో ఈ రోజు చాలా కీలకం, గుర్తుంచుకోవాల్సిన రోజుగానే చెప్పాలి. మంత్రులకు కూడా భావోద్వేగమైన రోజుగా పేర్కొనాలి.
Tags:    

Similar News