వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు నాకు వ‌ద్దు.. మీకొక న‌మ‌స్కారం!

Update: 2022-04-22 13:30 GMT
ఏ రాజ‌కీయ నాయ‌కుల‌కైనా పార్టీలో కానీ ప్ర‌భుత్వంలో కానీ ప‌దువులు ఇస్తామంటే సంతోషప‌డ‌తారు. త‌మ‌కు ప్రాధాన్య‌త ద‌క్కుతుంద‌నే ఆనందం వాళ్ల‌లో క‌నిపిస్తుంది. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైసీపీ నాయ‌కుల ప‌రిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్న‌ట్లు తెలిసింది. పిలిచి మ‌రీ ప‌ద‌వులు ఇస్తామ‌న్నా.. ఆ ప‌ద‌వులు వ‌ద్దు బాబోయ్‌.. త‌మ‌కో దండం అని నాయ‌కులు అంటున్నార‌ని స‌మాచారం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మంత్రివ‌ర్గ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ పూర్త‌యింది. సీఎంగా అధికారం చేప‌ట్టిన‌ప్పుడు జ‌గ‌న్ చెప్పిన‌ట్లుగానే మంత్రివ‌ర్గాన్ని రెండోసారి విస్త‌రించారు. అయితే అక్క‌డితో గొడ‌వ ముగిసిపోలేదు. ఇప్పుడే అస‌లు స‌మ‌స్య ప్రారంభ‌మైంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

వాళ్ల‌కు కూల్ చేసేందుకు..జ‌గ‌న్ మంత్రివ‌ర్గ కూర్పుపై స‌న్నాహాలు మొద‌లెట్టార‌ని తెలియ‌గానే ఆశావ‌హులు తాడేప‌ల్లిగూడెంకు వ‌రుస క‌ట్టారు. జ‌గ‌న్‌ను ప్ర‌సన్నం చేసుకునే ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ తీరా కేబినేట్లో మాత్రం అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌డంతో భంగ‌పాటు ఎదురైంది. ఇలాంటి నేత‌లు వైసీపీలో చాలా మందే ఉన్నారు.

మ‌రోవైపు మంత్రివ‌ర్గం నుంచి వేటు ప‌డ్డ ఎమ్మెల్యేలూ అధిష్ఠానంపై గుర్రుగానే ఉన్నారు. వీళ్ల‌ను కూల్ చేసేందుకు జ‌గ‌న్ ఓ వ్యూహం సిద్దం చేశారు. ఎన్నిక‌ల బాధ్య‌త ఈ నాయ‌కుల‌పై మోపుతున్నాన‌ని.. వాళ్ల‌ను జిల్లా, ప్రాంతీయ అధ్య‌క్షులను చేస్తున్న‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. కానీ ఇప్పుడు ఈ ప‌ద‌వుల‌పై ఆ నేతలు అనాస‌క్తి వ్య‌క్తం చేస్తున్నారు.

ఏం చేసుకోవాల‌ని..మంత్రి ప‌ద‌వి ద‌క్క‌ని వాళ్ల‌కు చాలా మందికి సామాజిక వ‌ర్గం ప్ర‌కారం జిల్లా అధ్య‌క్షుల‌ను చేశారు. మంత్రి ప‌ద‌వి కోల్పోయిన నేత‌ల‌ను ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లుగా నియ‌మించారు. అయితే పార్టీలో మొద‌టి నుంచి ఉన్న‌ప్ప‌టికీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో భాగంగా చోటు ద‌క్క‌ని నాయ‌కులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వులు స్వీక‌రించేందుకు స‌సేమీరా ఒప్పుకోవ‌డం లేద‌ని స‌మాచారం. అయితే ఈ అధ్య‌క్షుల‌కు నిర్ణ‌యం తీసుకునే హ‌క్కు లేక‌పోవ‌డం మ‌రో కార‌ణంగా క‌నిపిస్తోంది. జ‌గ‌న్‌తో నేరుగా ట‌చ్‌లోకి వెళ్ల‌కుండా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి రిపోర్ట్ చేయాల‌ని అధ్య‌క్షుల‌ను అధిష్టానం ఆదేశించింద‌ని టాక్‌.

అలా అయితే ఈ ప‌ద‌వులు ఇక ఎందుకు అని చాలా మంది సైలెంట్ అయిపోయారు. హైక‌మాండ్ మీద అలిగార‌ని తెలిసింది. ఓ నాయ‌కుడు వ‌ద్ద‌న్న‌ప్ప‌టికీ అధిష్ఠానం జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింద‌ని.. ఇప్పుడా నేత జిల్లాకు వెళ్ల‌కుండా హైద‌రాబాద్‌లోనే ఉంటున్నార‌ని స‌మాచారం. అంతే కాకుండా ఇప్పుడు జిల్లా అధ్య‌క్షులుగా త‌మ కంటే జూనియ‌ర్ నేత‌లైన ఎమ్మెల్యేలు, మంత్రుల కింద ప‌ని చేయ‌డం కూడా సీనియ‌ర్ల‌కు న‌చ్చ‌డం లేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అందుకే ఆ ప‌ద‌వుల‌కు ఓ దండం అని చెబుతూ హైక‌మాండ్ మీద నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని టాక్‌.
Tags:    

Similar News