తెలుగోళ్లు సరే.. తమిళోళ్లు సైతం తిట్టేస్తున్నారు జగనా?

Update: 2022-04-13 05:17 GMT
అసలేం జరుగుతోంది తిరుమలలో? తెలుగు వారికి మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న తమిళనాడు.. కర్ణాటక.. ఒడిశాల నుంచి కూడా శ్రీవారి భక్తులు లక్షల్లో ఉంటారు. ఆయన్ను ఇలవేల్పుగా భావించి.. తిరుమలకు వచ్చి.. స్వామి దర్శనం చేసుకుంటే చాలు తమ కష్టాలకు చెల్లుచీటి పడుతుందని భావిస్తుంటారు.

కరోనా కారణంగా గడిచిన రెండేళ్లుగా ప్రయాణాలు చేయటానికి సవాలచ్చ ఆలోచించే వారికి.. తాజా పరిణామాలు ఇంటి నుంచి బయటకు వచ్చేలా చేయటమే కాదు.. ఇంతకాలం దూరంగా ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్లటం ఎక్కువైంది. యాదాద్రికి భక్తులు ఎంతలా పోటెత్తుతున్నారో చూసినప్పుడు.. తిరుమలకు మరెంత రద్దీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇలాంటి వేళలో.. భక్తుల రద్దీ కి సంబంధించి వెనువెంటనే నిర్ణయాలు తీసుకోవటం.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఎదురుకాకుండా చూసుకోవటం చాలా అవసరం. పెరిగే రద్దీకి తగ్గట్లుగా సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ కావటమే కాదు.. సీఎం పని తీరు.. సమర్ధత మీద విమర్శలు వెల్లువెత్తుతాయి. మంగళవారం దర్శన టికెట్ల జారీ సందర్భంగా చోటు చేసుకున్న రచ్చ.. భక్తులు పడిన అవస్థలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావటమే కాదు.. జగన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

వెయ్యి కోట్ల డబ్బులు సంక్షేమ పథకాల పేరుతో పంపిణీ చేస్తే వచ్చే మంచి పేరుకు మించిన చెడ్డపేరు.. తిరుమలలో భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులతో వస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

జగన్ ముఖ్యమంత్రిగా అయిన నాటి నుంచి తిరుమలకు సంబంధించిన విషయాలు ఆయన సమర్థతపై సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయని చెప్పాలి. తిరుమల విషయంలో టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలు.. అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

తాజాగా ఒక తమిళ మహిళ తిరుమలకు వచ్చిన సందర్భంగా తనకు ఎదురైన ఇబ్బందుల్ని ఏకరువు పెట్టటమే కాదు.. ఎన్టీఆర్..చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తిరుమలలో పరిస్థితులు చాలా బాగుండేవని చెబుతున్న మాటలు.. జగన్ సర్కారుకు షాకులు ఇచ్చేలా చేస్తున్నాయి. "జగన్మోహన్ సరి ఇల్లే.. యాక్ చీ.." అంటూ.. చంద్రబాబు మళ్లీ రావాలన్న మాట విన్నప్పుడు.. రాష్ట్రానికి ఏ మాత్రం సంబంధం లేని ఒక సగటు మహిళ ఆయన్ను సీఎంగా ఎందుకు చూడాలనుకుంటుందన్న విషయంపై సీఎం జగన్ కాసింత దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలా జరుగుతుందంటారా?


Tags:    

Similar News