వైసీపీకి అర్ధమవుతోందా : కార్యకర్త జిందాబాద్...?

Update: 2022-07-01 12:30 GMT
కార్యకర్తే పార్టీకి జీవగర్ర అని ప్రజా నటుడు ఆర్ నారాయణమూర్తి ఒక సినిమాలో చెబుతారు. నిజానికి నాయకులు ఎంత మంది ఉన్నా వారు అందలాలు ఎక్కి ఎంత బాగా వెలిగిపోయినా కార్యకర్తలు  అంటూ ఎవరూ లేకుంటే జెండా పట్టేవారే కరవు అయితే ఇక ఏ పార్టీకైనా  పునాదులు కదిలిపోయినట్లే. అయితే అధికారంలోకి రానంతసేపూ క్యాడర్ గురించి తెగ కలవరించే నాయకులు తీరా పవర్ లోకి వచ్చాక ఆ ఊసే మరచిపోతారు

దాని ఫలితంగా వారు తరువాత ఎన్నికల్లో దెబ్బ తిన్న సంగతులూ కళ్ళ ముందు కనిపిస్తాయి. కానీ ఒక పార్టీని చూసి మరో పార్టీ అసలు ఏ కోశానా  తెలుసుకోదు, గుణపాఠాలు అయితే నేర్చుకోదు, టీడీపీ అయిదేళ్ల పాలనలో క్యాడర్ కి దెబ్బ వేయడం వల్లనే 23 సీట్లతో కునారిల్లింది అని అంతా ఒప్పుకుంటారు. మరి వైసీపీ మూడేళ్ళ ఏలుబడిలో క్యాడర్ కి ఏం చేసింది అన్నది చూస్తే కార్యకర్త కంట కన్నీరే తక్కువ.

ఒక విధంగా వైసీపీని ఎత్తుకుని భుజాల మీద మోసిన కార్యకర్త ఈ రోజు ఏ మాత్రం సంతోషంగా లేడు. గడప గడపకు ప్రభుత్వం అన్న కార్యక్రమం తీసుకుంటే జనాల కంటే ముందే కార్యకర్త నిలదీసే పరిస్థితి ఎదూరైంది. అంతే కాదు వైసీపీ ప్లీనరీలు పెడితే బోసిపోతున్నాయి. దానికి కళ కట్టించాల్సిన కార్యకర్త సైలెంట్ కావడం వల్లనే ఈ పరిస్థితి అంటున్నారు.

ఈ నేపధ్యంలో గత మూడు నెలలుగా ఏపీలో వైసీపీ చేపడుతున్న పార్టీ కార్యక్రమాలకు పెద్దగా రెస్పాన్స్ రాకపోవడానికి ప్రధాన కారణం అయితే పార్టీ పెద్దలకు  బాగా తెలిసింది అంటున్నారు. క్యాడర్ బోరుమంటోంది అని ఎట్టకేలకు అధినాయకత్వం గుర్తించింది అని కూడా చెబుతున్నారు. దాని ఫలితంగా ఇపుడు క్యాడర్ ని లీడర్ జిందాబాద్ కొట్టే సీన్ అయితే కనిపిస్తోందిట

లేటెస్ట్ గా క్యాడర్ తమ గోడు వెళ్ళబోసుకున్న వేళ రాష్ట్రానికి ఆర్ధిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి క‌ర్నూలు జిల్లా వైసీపీ ప్లీన‌రీలో వారిని ఊరడించే ప్రయత్నం చేస్తూనే ఒక సంచలన ప్రకటన చేశారు. వైసీపీ క్యాడర్ ని ఎపుడూ దూరం చేసుకోదు అని ఆయన భరోసా ఇచ్చారు. కార్యకర్తల కష్టాలు తమకు తెలుసు అని కూడా చెప్పారు. అందుకే వారి కోసం ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక స్కీమ్ ని తొందరలో తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించడం  విశేషం.

పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ఆ స్కీమ్ ద్వారా లబ్ది చేకూరుస్తామని ఆయన చెప్పడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. కార్యకర్తల గోడు ఎక్కడ ఎవరికి చేరాలో వారికి చేరిందని దాని ఫలితమే మంత్రి గారి నోటి వెంట స్కీమ్ వంటి ప్రకటనలు వచ్చాయని అంటున్నారు. అయితే ప్రకటనలు ఓకే కానీ అది ఎపుడు అమలు అవుతుంది అన్నది చూడాలి. కష్టపడిన కార్యకర్తలు అంటున్నారు. అసలు వారిని ఎలా గుర్తిస్తారు అన్నది కూడా పెద్ద ప్రశ్న.

క్యాడర్ లక్షలలో ఉంటుంది. ఏ స్కీమ్ కి అయినా పరిమితులు ఉంటాయి. మరి అవి కూడా అర్హులకు దక్కకపోగా ప్రజా ప్రతినిధులు తమ చుట్టూ ఉన్న వారికి ఇప్పించుకుంటే అసలైన కార్యకర్త అలా కూడా అన్యాయం అయిపోయే అవకాశం ఉంది. అపుడు వారు నిజంగా ఎవరి మాటా వినకుండా అగ్గిరవ్వలే అయిపోతారు. అలా కనుక జరిగితే ఎన్నికల ముందు ఇంకా పెద్ద నష్టం వాటిల్లుతుంది. మొత్తానికి చూస్తే వైసీపీ హై కమాండ్ మాత్రం క్యాడర్ మీద ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తే మాత్రం క్యాడర్ ఫుల్ ఖుషీ అవుతారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News