అమరనాధా... ఫోటో షూట్ ఇండస్ట్రీ తెచ్చావా సామీ...

Update: 2022-08-21 02:30 GMT
ఏపీలో పరిశ్రమలు దండీగా వస్తున్నాయని బిగ్ సౌండ్ చేసే మంత్రి గారు మన గుడివాడ అమరనాధ్. ఆయన ఏపీకి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తూంటే చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని బండలు కూడా వేస్తారు. పోనీ చూద్దామంటే పరిశ్రమలు అయితే ఇబ్బడి ముబ్బడిగా ఏమీ రావడంలేదు. ఇక పారిశ్రామికంగా ఏపీ ఎంతో అభివృద్ధి సాధించాల్సి ఉంది అని గణాంకాలు కూడా తెలియచేస్తున్నాయి.

అయినా సరే కొద్ది నెలల క్రితం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమరనాధ్ మాత్రం తగ్గేదే లే అంటున్నారు. ఏపీ కేరాఫ్ ఇండస్ట్రీస్ అని ఆయన చెబుతూ వస్తున్నారు. సరే పరిశ్రమలు కొత్తగా వచ్చినవేంటి స్వామీ అని టీడీపీ లాంటి పార్టీల నేతలు అడుగుతున్నారని కాబోలు ఆయన ఇక మాటలతో లాభం లేదనుకుని ఏకంగా ఫోటో షూట్ ఇండస్ట్రీని ఏపీకి తెచ్చేసినట్లున్నారుట.

అవును గుడివాడ అమరనాధ్ ఫోటో షూటింగులో ఇపుడు తెగ బిజీ అయిపోయారు. అటూ ఇటూ కెమెరాలు, వాటి వెనకాల టెక్నీషియన్లు, మంత్రి గారేమో  తెలుపు మరియు క్రీమ్ దుస్తులలో అదిరిపోయే ఫోజులు ఇచ్చేస్తున్నారు. కార్ డోర్ పట్టుకుని అభివాదం చేస్తూ ఒక ఫోజు అయితే మరో ఫోజులో సెల్ ఫోన్ పట్టుకుని సీరియస్ గా నల్ల కళ్ళద్దాల మాటున  చూస్తూ కనిపిస్తారు.

ఇవన్నీ చూస్తే ఏ సినిమా హీరోకు తీసిపోని విధంగానే ఉన్నాయి. అవును అమరనాధ్ యువకుడే. ఆయన అనుకుంటే సినిమా  హీరో కూడా కావచ్చు. అయితే ఆయన పొలిటికల్ హీరో కావాలన్ ఇలా చేస్తున్నారా అన్న చర్చ వస్తోంది. ఇలా తీసిన ఫోటోలను ఫోజులను ఏకంగా నెట్టింట పెట్టారా పెట్టించారా అన్నది ఎవరికీ  తెలియడం లేదు కానీ అవి అక్కడ తెగ హల్ చల్ చేస్తున్నాయి.

నెట్టింట మాత్రం గుడివాడ ఫోజులను చూసి నెటిజన్లు ఒక్క లెక్కలో కామెంట్స్ చేస్తున్నారు. భారీ పరిశ్రమల మంత్రి గారు కొంపదీసి ఫోటో షూట్ ఇండస్ట్రీని ఏపీకి తెచ్చేస్తున్నారా ఏంటి అని సెటైర్లు వేస్తున్నారు. గుడివాడ ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఇప్పటిదాకా తనదే పై చేయి అనిపించుకున్నారు. ఇపుడు మాత్రం ఆయన ఈ ఫోటో షూట్ పుణ్యమాని తానే ట్రోల్ అవుతున్నారు.

ఇప్పటికే వైసీపీలో ఓ అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్ లాంటి వారు నెటిజన్ల చేత ట్రోల్ అవుతున్నారు. ఆ జాబితాలో లేటెస్ట్ గా గుడివాడ కూడా చేరిపోయారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఆయన ఎందుకు ఇలా చేసారు అన్నది మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు. అయితే తాను వైసీపీలో హైలెట్ కావాలనే మంత్రి గారు ఇలా ఫోటో షూట్ పెట్టించుకున్నారు అని అంటున్నారు.

మరి ఇప్పటిదాకా జగన్ దగ్గర మంచి మార్కులు తెచ్చుకున్న గుడివాడ లేటెస్ట్  ఫోటో షూట్ వ్యవహారం మాత్రం శృతి మించేలా ఉందని అంటున్నారు. దాని మీద వైసీపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో కానీ సోషల్ మీడియాకు మాత్రం మంత్రి గారు చిక్కిపోయినట్లే సీన్ చూస్తే కనిపిస్తోంది. ఒక విధంగా ఇలాంటి సిల్లీ ఇష్యూస్ తో  మినిష్టర్ గారు  కోరి మరీ ట్రోల్ అయ్యే అవకాశం ఇచ్చుకుంటున్నారా అని కూడా చర్చ సాగుతోంది. మరి గుడివాడ దీనికి బదులేమి ఇస్తారో చూడాలి.
Tags:    

Similar News