కొత్త చర్చ : వైసీపీలో ఆమె ఎంట్రీ ...?

Update: 2022-07-09 16:30 GMT
వైసీపీతో తన రాజకీయ బంధాన్ని పెనవేసుకుని ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన దివంగత నేత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. ఇపుడు వైసీపీలో వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి జగన్ ఒక్కరే వైసీపీలో ఉన్నారు. వచ్చే ఎన్నికలు చూస్తే కీలకంగా మారనున్నాయి. జగన్ చూస్తే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు.

ఆయన ఈసారి పరిమితంగానే ఎన్నికల వేళ ప్రచారానికి  తిరగాల్సి ఉంటుంది. దాంతో వైసీపీ తరఫున స్టార్ కాంపెయినర్స్ ఎవరు అన్న చర్చ కూడా వస్తోంది. దాంతో వైఎస్ జగన్ సతీమణి భారతి ఇక మీదట వైసీపీలో కీలకమైన పాత్ర పోషిస్తారు అని ప్రచారం సాగుతోంది.

ఆమె ఏ పార్టీ పదవులనూ ఇప్పటికిపుడు చేపట్టకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ విధంగా ఆమె జనాల్లోకి వస్తారని అంటున్నారు.

మరో వైపు చూస్తే భారతిని వైసీపీలో ప్రముఖంగా చేసేందుకే విజయమ్మ చేత రాజీనామా చేయించారన్న ప్రచారం ఎల్లో మీడియా చేస్తోంది. సీబీఐ కేసులతో జగన్ ఏ కారణం చేతనైనా రేపటి రోజున జైలుకు వెళ్లాల్సి వస్తే అపుడు ఆయన స్థానంలో సీఎం గా భారతిని ఎన్నుకునేందుకే ఈ ఎత్తుగడ అని కూడా అంటున్నారు.

మొత్తానికి చూస్తే వైసీపీలో ఇపుడు కొత్త చర్చ సాగుతోంది. అలాగే జనాలల్లోనూ రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారిలోనూ జరిగే చర్చ ఏంటి అంటే ఇక మీదట వైసీపీలో యాక్టివ్ రోల్ ని భారతి పోషిస్తారు అని. ఎటూ షర్మిల ఏపీ రాజకీయాల వైపు చూసే చాన్స్ లేదు.

అలాగే విజయమ్మ కూడా వైఎస్సార్టీపీలోనే కీలకం అవుతారు కాబట్టి ఇటు వైపు రారు అనే అంటున్నారు. దాంతో వైఎస్ జగన్ సతీమణి భారతిని ముందుకు తీసుకురావడం ద్వారా వైసీపీలో వైఎస్ ఫ్యామిలీ నుంచి కొత్త స్టార్ కాంపెయినర్ ని పరిచయం చేస్తారు అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.

జగన్ ఎటూ వైసీపీకి జీవితకాలం అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. పైగా జాతీయ ప్రెసిడెంట్ గా ఆయన ఉన్నారు. దాంతో పార్టీ సంస్థాగత పదవులు ఎవరికి ఇస్తారు, ఎవరెవరిని అకామిడేట్ చేస్తారు అన్నది కూడా ఆసక్తికరమైన చర్చగా ఉంది. మరి పార్టీ పదవులలో భారతికి ఏమైనా చాన్స్ ఉంటుందా అన్నది కూడా చర్చగానే ఉంది.
Tags:    

Similar News