జగన్ స్పీచ్ : ఏవీ నాటి మెరుపులు... చురకలు ?

Update: 2022-07-08 15:22 GMT
వైసీపీకి సర్వసత్తాక అధికారి జగన్. ఆయన ఇమేజ్ పార్టీకి కొండంత పెట్టుబడి. జగన్ తోనే పార్టీ. ఆయనే పార్టీకి జగమైనా జనమైనా. జగన్ ఫేస్ వాల్యూనే పార్టీకి ఎపుడూ శ్రీరామ రక్ష. ఆ మాటకు వస్తే ఏ ప్రాంతీయ పార్టీకి అయినా అధినాయకుడికి దమ్మూ దక్షత ప్రజాకర్షణశక్తి అసలైన ఆయుధం. చంద్రబాబు పాతికేళ్ళుగా టీడీపీ పగ్గాలను తన చేతిలో ఉంచుకుని పార్టీని నడిపిస్తున్నారు. జగన్ తో పోలిస్తే బాబుకి ఇమేజ్ తక్కువే. అయినా వ్యూహచతురుడు బాబు. ఎప్పటికపుడు వచ్చే  ప్రతీ ఇష్యూని పాలిటిక్స్ చేస్తూ అలా జనాలను అట్రాక్ట్ చేయడంలో దిట్ట.

జగన్ విషయం తీసుకుంటే అలా కాదు, ఆయన కొన్ని పరిమితులతో ప్రసంగాలు చేస్తారు. అదే విధంగా ఆయన స్పీచ్ క్లుప్తంగా సూటిగా ఉంటుంది. ఇపుడు అయితే  చంద్రబాబు పంచ్ డైలాగులు బాగా  పేల్చుతున్నారు. జగన్ కూడా అలాంటివి ఉపయోగించాలని  పార్టీ జనాలు  అంతా కోరుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం ఇప్పటికీ విపక్ష నేతగానే స్పీచ్ ఇస్తున్నారు. ఈ స్పీచులు పార్టీ వారికి ఎలా ఉన్నా జనాలకు మాత్రం పెద్దగా ఎక్కడంలేదు అంటున్నారు.

జగన్ కొత్త విషయాలను ఏర్చి కూర్చి మసాలా దట్టించి స్పీచ్ ఇస్తేనే అవి చేరాల్సిన  వారికి చేరుతాయి. ఇపుడు మూడేళ్ల పాలన తరువాత కూడా దుష్టచతుష్టయం అంటూ టీడీపీ అనుకూల మీడియాను  బాబుని ఆడిపోసుకుంటే జనాలు ఎలా ఈ వైపునకు చూస్తారు అన్న చర్చ ఉంది. అంతేకాదు, వైసీపీ శ్రేణులకు కూడా ఉత్సాహం కలిగించేలా అధినాయకుడు  స్పీచ్ ఉండడం లేదని అంటున్నారు.

జగన్ ఎక్కడికి వెళ్ళినా స్టీరియో టైప్ స్పీచ్ నే ఇస్తున్నారు అని అంటున్నారు. ఆ స్పీచ్ లో ఒకప్పటి మెరుపులు చురకలు లేవని కూడా విశ్లేషిస్తున్నారు. పార్టీకి ఆయువు పట్టు లాంటి ప్లీనరీలో అధికార హోదాలో సీఎం గా తొలిసారి  జగన్ చేసిన ప్రారంభ  ప్రసంగం పూర్తిగా తేలిపోయింది అని అంటున్నారు. దీని మీద విపక్ష టీడీపీ నేతలైన వర్ల రామయ్య వంటి వారు జగన్ పేలవంగా ప్రసంగం చేశారు అని నిందించారు.

వారి సంగతి పక్కన పెడితే పార్టీ జనాలను సైతం జగన్ స్పీచ్ ఏ మాత్రం మెప్పించలేదని అంటున్నారు. ఇంకా చెప్పాలీ అంటే ఆయన కంటే విజయమ్మ స్పీచే సూపర్ గా ఉందని మార్కులు పడుతున్నాయి. ఆమె పార్టీ  జనాలను చూస్తూ చక్కగా మాట్లాడారు, జగన్ అయితే కాగితాలలో రాసుకున్న దాన్ని చదువుతూ అలా జస్ట్ అయింది  అనిపించారు అన్న చర్చ కూడా వస్తోంది.

పార్టీకి స్టార్ కాంపెయినర్ అయినా ప్రజాకర్షణ  అయినా జగనే. ఆయన స్పీచ్ ధాటీగా ఉండడం లేదు అని ఈ మధ్య విమర్శలు అయితే వస్తున్నాయి. దాన్ని ఆయన అధిగమించేలా చూసుకోవాలని కోరే వారూ ఉన్నారు. అగ్రెసివ్  మూడ్ తో  జనాల్లోకి వెళ్తేనే అట్రాక్షన్ ఉంటుంది తప్ప చప్ప చప్పగా ముగిస్తే రేపటి ఎన్నికల్లో జనాలు వచ్చినా వినే మూడ్ లో ఉంటారా అన్నదే జరుగుతున్న చర్చ అంటున్నారు.
Tags:    

Similar News