పోటీ చేయ‌డానికి ప్ర‌తిజ్ఞ‌లెందుకు.. ష‌ర్మిల‌మ్మా? మ‌రీ సిల్లీకాపోతే!!

Update: 2022-12-16 15:51 GMT
దేశంలో పుట్టిన ఏ వ్య‌క్తి అయినా.. పురుషుడా.. మ‌హిళా.. ఆఖ‌రుకు ట్రాన్స్‌జెండరా.. అనే తేడాలేకుండా.. ఎక్క‌డైనా నివాసం ఉండొచ్చు.(ఒక్క ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ ప్రాంతాలు మిన‌హా) ఎలాంటి ఉద్యోగ‌మైనా చేయొచ్చు.. ఎంతైనా సంపాయించుకోవ‌చ్చు. ఇక‌, రాజ‌కీయంగా చూసుకున్నా.. పార్టీలు పెట్టుకోవ‌చ్చు.. ఏ పార్టీ త‌ర‌ఫునైనా పోటీ చేయొచ్చు.. లేదా.. సొంత‌గా ఇండిపెండెంటుగా అయినా.. ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అయినా..పోటీకి దిగొచ్చు.

ఇది రాజ్యాంగం దేశ పౌరుల‌కు ఇచ్చిన స్వేచ్ఛ‌! దీనిలో ప్ర‌త్యేక‌త ఏమీ లేదు. ప్ర‌ధాని మోడీ అంతటి నాయ‌కుడే.. త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌ను కాద‌ని.. వ‌రుస‌గా రెండు సార్లుగా ఉత్త‌రప్ర‌దేశ్‌లోని వార‌ణాసి నుంచి పోటీ చేసి గెలుపుగుర్రం ఎక్కుతున్నారు. సో.. ఎవ‌రు ఎక్క‌డ నుంచి పోటీ చేయాల‌నేది వారి ఇష్టం. దీనికి ప్ర‌తిజ్ఞ‌లు.. కాక‌ర‌కాయ‌.. అవ‌స‌రం లేదు. కానీ, ఘ‌న‌త వ‌హించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు.. ష‌ర్మిల మాత్రం పోటీకి కూడా ప్ర‌తిజ్ఞ‌ల మార్గం ఎంచుకున్నారు.

ఈ క్ర‌మంలో ఆమె రాజ‌కీయ‌ సెంటిమెంటును రాజేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఆమె చేసిన ప్ర‌తిజ్ఞ ఏంటంటే.. ఖమ్మం జిల్లా పాలేరు నుంచే ప్రతి గడపకూ నాటి వైఎస్‌ పాలనను గుర్తుచేసేలా ప్రభుత్వాన్ని అందిస్తామని వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలో నిలుస్తానని అన్నారు. అన‌డ‌మే కాదు..  సుమా.. పాలేరు మట్టి చేతబట్టుకుని.. ‘మట్టి సాక్షిగా చెబుతున్నా పాలేరు నుంచే పోటీ చేయాలని వైఎస్‌ బిడ్డగా నిర్ణయం తీసుకున్నా’ అని ప్రకటించారు.  

పాలేరు ప్రజల హక్కుల కోసం పోరాడుతానని, హక్కులు సాధించే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనకు పోరాడే శక్తి ఉందని, మాట కోసం నిలబడే నిజాయితీ, సేవ చేయాలన్న తపన ఉందన్నారు. ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులు వచ్చినా.. ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం నిలబడతామ ని వెల్లడించారు.

అయితే.. అస‌లు పాలేరు నుంచి కాక‌పోతే.. మ‌రోచోట నుంచి పోటీ చేసినా చేయొచ్చు.. దీనికి ప్ర‌తిజ్ఞ‌లు.. శ‌ప‌థాలు ఎందుకు? అనేది ప్ర‌శ్న‌.ఇదేదో కేంద్రంతో మాట్లాడి.. నిధులు తీసుకువ‌స్తా.. అభివృద్ధి చేస్తా.. అని శ‌ప‌థాలు చేస్తే.. అర్ధం ఉండేద‌ని, కానీ, ఇలా చేయ‌డం సిల్లీగా ఉందని నెటిజ‌న్లు పెద‌వి విరుస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News