జడ్జీల ఫోన్లు ట్యాప్ అయ్యాయా?... జగన్ సర్కారు సీరియస్

Update: 2020-08-15 17:30 GMT
ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని, న్యాయమూర్తులపై ఓ నిఘా కన్ను పనిచేస్తోందని శనివారం వచ్చిన వార్తలు పెను కలకలమే రేపాయని చెప్పాలి. ఈ వ్యవహారంపై జగన్ సర్కారు సీరియస్ గా స్పందించింది. ఈ తరహా తప్పుడు కథనాలను సహించేది లేదని, సదరు ఊహాజనిత వార్తలు, తప్పుడు వార్తలపై కఠిన చర్యలు తీసుకునే దిశగా జగన్ సర్కారు కదలుతోందన్న వార్తలు మరింత సంచలనంగా మారాయి. ఈ క్రమంలో ఈ వ్యవహారం ఏపీలో పెను దుమారమే రేపనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఏపీ హైకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి ఫోన్ పలుమార్లు హ్యాంగ్ అవుతున్న నేపథ్యంలో సదరు ఫోన్ ను తరచి చూడగా... తన ఫోన్ కాల్స్ తన ప్రమేయం లేకుండానే డైవర్ట్ అవుతున్నాయని, తన ఫోన్ కు వచ్చిన మెసేజ్ లను కూడా తాను చూడకముందే ఇతరులు చూసేస్తున్నారంటూ సదరు న్యాయమూర్తి ఒకింత ఆందోళనకు గురయ్యారట. ఇదే విషయాన్ని ఆయన తన సహచర జడ్జీతో పంచుకోగా.. ఈ తరహాలో మరో ఆరుగురు న్యాయమూర్తులు కూడా తమకూ ఇదే సమస్య ఎదురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారట.

ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా ఆ జడ్జీలలో ఏ ఒక్కరు కూడా ఫిర్యాదు చేయకున్నా... ఈ విషయాన్ని ఓ ప్రముఖ దినపత్రిక శనివారం నాటి తన సంచికలో ప్రధాన శీర్షికతో వార్తాకధనాన్ని ప్రచురించింది. అదే సమయంలో శనివారం నాడు పలు ఛానెళ్లు కూడా ఇదే తరహా కథనాలను ప్రసారం చేశాయి. ఈ వార్తలపై జగన్ సర్కారు చాలా వేగంగానే స్పందించినట్లు సమాచారం. జడ్జీల ఫోన్ ట్యాపింగ్ అన్నది ఇప్పటిదాకా జరగలేదని, అసలు అలాంటి వ్యవహారంపై ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదు రాలేదని కూడా ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా ఈ తరహా తప్పుడు కథనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందట. ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య దూరం పెంచే దురుద్దేశ్యంతోనూ ఈ కథనాలను అల్లుతున్నారని కూడా ప్రభుత్వంలోని పెద్దలు భావిస్తున్నారట. మొత్తంగా ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించే అవకాశాలున్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.
Tags:    

Similar News