మాడుగుల మ్యాటరేంటి...డిప్యూటీతో ఢీ ?

Update: 2022-04-24 03:44 GMT
మాడుగుల నియోజకవర్గం. అనకాపల్లి జిల్లలో కీలకమైన సీటు. అంతే కాదు, టీడీపీ పుట్టినది లగాయితీ రెండు దశాబ్దాల పాటు అక్కున చేర్చుకున్న కంచుకోట. అలాంటి చోట 1978 ఎన్నికల తరువాత మళ్ళీ కాంగ్రెస్ గెలవాలీ అంటే 2004 వరకూ టైమ్ తీసుకుంది. ఇక 2009లో మళ్లీ సైకిలెక్కేసింది మాడుగుల.

అయితే వైసీపీ ఏర్పాటుతో ఆ పార్టీకే ఓటేస్తానని ఒట్టేసుకుంది ఇదే మాడుగుల. అలా 2014, 2019 ఎన్నికల్లో వరసబెట్టి బూడి ముత్యాలనాయుడు గెలిచారు. ఆయన కింద నుంచి వచ్చిన నేత. వార్డు మెంబర్ నుంచి పంచాయతీ రాజ్ మినిస్టర్ గా పదవి చేపట్టడం అంటే మాటలు కాదు. ఇక మాడుగులలో పసుపు పార్టీ బలం రోజురోజుకూ సన్నగిల్లిపోతోంది.

అక్కడ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఒక వైపు ఉంటే కొత్తగా ఇంచార్జి గా పీవీజీ కుమార్ వచ్చారు. వచ్చి ఆరు నెలలు అయింది. దాంతో వర్గ పోరు మరింత ముదిరింది. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి తనకే ఇంచార్జి పదవి ఉండాలని పట్టుబడుతున్నారు. ఆయన పీవీజీ కుమార్ ని ఖాతరు చేయడంలేదు.

ఇక మరో వైపు పైలా ప్రసాదరావు అనే నేత ఇంకో వర్గంగా ఉంటున్నారు. ఇలా సవాలక్ష తలనొప్పులతో మాడుగుల టీడీపీ సతమతమవుతూంటే బూడికి కాస్తా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కేసింది. దాంతో ఆయన ఎన్నికల వేళకు అధికార హోదాతో బలంగా ఉంటారు. టీడీపీలో చూస్తే ఈ గ్రూపులు తగవులూ ఎంతకీ తెగడంలేదు, తీరడంలేదు.

ఈ నేపధ్యంలో మాడుగుల మరోసారి ఫ్యాన్ పార్టీకే ఫేవర్ అవుతుందా అంటే పరిణామాలు అదే నిజం అంటున్నాయి. అయితే టీడీపీని బలంగా చేసేందుకు అధినాయకత్వం శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ మధ్యనే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అందరినీ పిలిచి మాట్లాడినట్లుగా భోగట్టా.

అయితే గవిరెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఊరుకోరు. పీవీజీ కుమార్ కే సీటు అని ఆయన వర్గం అంటోంది. పైలా మధ్యలో తన్నుకుపోతే మరింత రచ్చ. ఇలా ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వారు సహకరించే సీన్ అయితే లేదు. దాంతో బూడి హ్యాట్రిక్ కొట్టే చాన్స్ కోరి మరీ టీడీపీయే కల్పిస్తోందా లేక నాటికి బలమైన నేత దిగుమతి అయి అంతా సెట్ చేస్తారా అన్నది చూడాలి. కొసమెరుపు ఏంటి అంటే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడు కన్ను ఈ సీటు మీద ఉందని. మరి ఆయన వస్తే ఆల్ రైటా. అంతా సెట్ రైటా. అంటే ఏమో. ఏది ఏమైనా బూడి లక్ మాత్రం గట్టిగానే ఉందని అంటున్నారు.
Tags:    

Similar News