త‌గ్గేదేలే అంటున్న రేవంత్‌

Update: 2022-04-23 17:30 GMT
తెలంగాణ రాజ‌కీయాల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా కాంగ్రెస్ పార్టీని నిల‌పాల‌నే ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇందుకు త‌గ్గ‌ట్లు వ్యూహాలు ప‌న్నుతున్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ‌కు ర‌ప్పించి టీ-కాంగ్రెస్ నేతల్లో జోష్ నింపాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా నిర్వహించబోయే భారీ బహిరంగ సభ కోసం టీపీసీసీ చీఫ్ శ్ర‌మిస్తున్నారు. ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయిలో ఏర్పాట్లు ప‌ర్య‌వేక్షించిన రేవంత్ రెడ్డి స‌భ విజ‌య‌వంతం చేసేందుకు, తద్వారా పార్టీలో త‌న ప‌ట్టు స‌డ‌ల‌కుండా చూసుకోవ‌డంతో పాటుగా శ్రేణుల్లో స్థైర్యం నింపేందుకు ఆయ‌న క‌స‌రత్తు చేస్తున్నారు.

వ‌రంగ‌ల్ స‌భ‌తో పార్టీకి జోష్ నింప‌డంలో భాగంగా, హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో త‌న‌ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పర్యటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను నియమించారు.

నల్లగొండకు గీతారెడ్డి, భువనగిరికి జగ్గారెడ్డి, ఖమ్మంకు కుసుమ కుమార్, మహబూబాబాద్‌కు శ్రీధర్ బాబు, కరీంనగర్‌కు షబ్బీర్ అలీని నియమించారు. స‌భ నిర్వ‌హ‌ణ‌ల విష‌యంలో గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాల‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. స‌భ‌కు సంబంధించిన పనులన్నీ చకచకా పూర్తి చేయాల‌ని రేవంత్ పార్టీ నేత‌ల‌కు సూచించారు.

అనంత‌రం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 2003వ సంవత్సరంలో సోనియా గాంధీ సభను తలపించేలా వరంగల్‌లో రాహుల్ సభ ఉంటుందని అన్నారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి 2003లో వరంగల్‌లో నిర్వహించిన సోనియా సభే కారణమని వ్యాఖ్యానించారు.
ఈ సభ 20 ఏళ్లు గుర్తుండేలా నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలోని రైతాంగానికి భరోసా కల్పించేందుకే ఈ సంఘర్షణ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీలోని నేతలకు ఏమైనా సమస్యలు ఉంటే పర్సనల్‌గా తనకు చెప్పాలని హిత‌వు ప‌లికారు.
Tags:    

Similar News