దిశ పేరెంట్స్ ప్రశ్నలకు హక్కుల కమిషన్ నోట మాట రాలేదా?

Update: 2019-12-09 06:42 GMT
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ హాత్యాచార ఉదంతం.. అనంతరం నలుగురు నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేయటం లాంటి ఘటనలు కొత్త చర్చకు కారణమయ్యాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా దిశ నిందితుల ఎన్ కౌంటర్ మీద దేశ వ్యాప్తంగా సానుకూలత వ్యక్తమైంది. కొద్ది మంది మినహా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఎన్ కౌంటర్ ను సమర్థించిన వారే.

ఇదిలా ఉంటే ఎన్ కౌంటర్ మీద విచారణ జరిపేందుకు జాతీయ మానవహక్కుల కమిషన్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చింది. ఈ సందర్భంగా దిశ పేరెంట్స్ ను విచారించారు. ఈ సందర్భంగా వారు ఆగ్రహంతో హక్కుల సంఘాన్ని పలు ప్రశ్నలతో సంధించినట్లు తెలిసిందే. తమ కమార్తెపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసినప్పుడు మానవహక్కుల కమిషన్ ఎక్కడకు పోయిందని ప్రశ్నించినట్లు తెలిసిందే. అప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారు? అని నిలదీసినట్లు చెబుతున్నారు.  

తమ కుమార్తె కనిపించటం లేదని పోలీస్ స్టేషన్ కు వెళితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయాన్ని ఎన్ హెచ్ ఆర్సీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. రెండో రోజు విచారణ కోసం దిశ కుటుంబ సభ్యులు రావాలని పోలీసులు కోరగా.. అధికారులకు.. దిశ కుటుంబ సభ్యులకు మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. తన కుమార్తె దశ దిన కర్మ జరుగుతున్న వేళ విచారణకు హాజరు కావాలంటూ కోరుతున్న వైనంపై కాలనీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు దిశ తండ్రి.. సోదరి తదితరులు విచారణకు హాజరయ్యారు. వారు సంధించిన ప్రశ్నలకు మౌనం వహించినట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News