నిమ్మగడ్డ.. తొలిసారి వెనకడుగు?

Update: 2020-11-18 17:45 GMT
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తానంటూ తన వంతు ప్రయత్నాలు చేస్తున్న ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. జగన్ సర్కార్ తో ఎన్నికల విషయంపై కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో తాజాగా ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించవద్దంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తాజాగా తేల్చిచెప్పడంతో తొలిసారి నిమ్మగడ్డ వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. గవర్నర్ హరిచందన్ తో భేటి ముగిసిన వెంటనే నిమ్మగడ్డ ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం.

ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తానని డిసైడ్ అయిన నిమ్మగడ్డ ఏర్పాట్లపై బుధవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జడ్పీ సీఈవోలు, పంచాయితీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని భావించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు కుదరవని సీఎస్ సాహ్ని లేఖ రాశాక గవర్నర్ కు దీనిపై ఫిర్యాదు చేశారు. ఆయనతో భేటి అయ్యాక కలెక్టర్లతో కాన్ఫరెన్స్ రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.

గవర్నర్ కు జగన్ సర్కార్ తీరుపై నిమ్మగడ్డ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డకు గవర్నర్ నుంచి ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తోంది. అందుకే కాన్ఫరెన్స్ రద్దు చేసినట్టు కనిపిస్తోందని ప్రచారం సాగుతోంది.

ఈ క్రమంలోనే నిమ్మగడ్డ దీనిపై మళ్లీ హైకోర్టును ఆశ్రయించబోతున్నట్టు తెలుస్తోంది. రాజ్యాంగబద్దంగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని కోర్టు తీర్పు చెబితే మాత్రం జగన్ సర్కార్ కు ఇది శరాఘాతంగా మారనుంది.
Tags:    

Similar News