అనవసరంగా గోక్కుంటున్నాడా ?

Update: 2021-03-21 14:30 GMT
రిటైర్మెంట్ తర్వాత ఎవరైనా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. కానీ స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం అనవసరంగా కెలుక్కుంటున్నాడా ? అని అనుమానంగా ఉంది. ఇప్పటికే ప్రివిలేజ్ కమిటి నోటీసు జారీచేసింది. ఏమని సమాధానమిచ్చినా యాక్షన్ తీసుకోవాలని కమిటి గనుక డిసైడ్ అయితే నిమ్మగడ్డను ఎవరు కాపాడలేరన్నది వాస్తవం. అయితే నిమ్మగడ్డ మాత్రం కమిటి అధికారాలనే ప్రశ్నిస్తు సమాధానం ఇవ్వటమే విచిత్రంగా ఉంది.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే తాను గవర్నర్ కు రాసిన లేఖలు ఎలా లీకవుతున్నాయంపై ఏకంగా హైకోర్టులో కేసే వేసేశారు. పైగా అన్నీ వ్యవహారాలపై ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతు తన పిటీషన్లో కోరటం మరీ విడ్డూరంగా ఉంది. అంటే నిమ్మగడ్డ తన లేఖలో గవర్నర్ కార్యాలయాన్నే అనుమానిస్తున్నట్లు అర్ధమైపోతోంది. అందుకనే గవర్నర్ ముఖ్య కార్యదర్శిని కూడా సీన్ లోకి లాగేశారు.

లేఖల లీకుల విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణను కూడా ప్రతివాదులుగా చేర్చారు. వీరిలో గవర్నర్ ముఖ్య కార్యదర్శికి తప్ప ఇతరులను ప్రతివాదులుగా చేర్చాల్సిన అవసరమే లేదు. తాను గవర్నర్ కు రాసిన లేఖలు లీకవుతున్నాయంటే గవర్నర్ కార్యాలయమే ఇందుకు సమాధానం చెప్పాలి కానీ ప్రధాన కార్యదర్శి, మంత్రులకు ఏమి సంబంధం ? అంటే కావాలనే వీళ్ళను సీన్ లోకి లాగినట్లు అర్ధమైపోతోంది.

మంత్రులిద్దరి ఫిర్యాదుతోనే ప్రివిలేజ్ కమిటి తనకు నోటీసిచ్చిందన్న అక్కసే నిమ్మగడ్డ పిటీషన్లో కనబడుతోంది. నోటీసును పిటీషన్తోనే ఎదుర్కోవాలని నిమ్మగడ్డ అనుకున్నట్లున్నారు. అయితే కమీషనర్ మరచిపోయిన విషయం ఏమిటంటే తాను వేసిన కేసు కోర్టులో తేలాలంటే చాలా కాలం పడుతుంది. పైగా గవర్నర్ కార్యాలయమే తన లేఖలను లీక్ చేస్తోందనే ఆధారాలు కూడా ఎక్కడా లేవు. కానీ ప్రివిలేజ్ కమిటి గనుక నిమ్మగడ్డ మీద యాక్షన్ తీసుకోదలిస్తే వెంబడే ఆపని చేసేస్తుంది.

అయినా ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. గతంలో తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదుచేశారు. మరి ఆ ఫిర్యాదు తెలుగుదేశంపార్టీకి మద్దతిచ్చే మీడియాలో ఎలా ప్రత్యక్షమైంది ? ఫిర్యాదుచేసింది నిమ్మగడ్డ. ఆ ఫిర్యాదును అందుకున్నది కేంద్ర హోంశాఖ. మరి మీడియాకు ఎవరు లీక్ చేసినట్లు ? దీనికి కమీషనరే సమాధానం చెప్పాలి.

అలాగే ప్రభుత్వానికి-కమీషనర్ కు బాగా గొడవలు జరుగుతున్న కాలంలో  ప్రధాన కార్యదర్శికి నిమ్మగడ్డ అనేక లేఖలు రాసేవారు. మరి అవన్నీ ఎవరు లీక్ చేస్తే మీడియాలో బ్రేకింగ్ వార్తలయ్యాయి ? మొత్తానికి జరుగుతున్నది చూస్తుంటే అనవసరంగా నిమ్మగడ్డ కెలుక్కుంటున్న విషయం అర్ధమైపోతోంది. మరి ఈ వివాదాలు ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాల్సిందే.
Tags:    

Similar News