నిమ్మగడ్డ సంచలనం..ఆ లేఖ తాను రాసిందేనట!

Update: 2020-04-15 16:02 GMT
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్... ఈ వ్యవహారంలో కీలకంగా మారిన అంశంపై ఇప్పుడు పుల్ క్లారిటీ ఇచ్చేశారు. వైసీపీ ప్రభుత్వం నుంచి తనకు ముప్పు పొంచి ఉందని - ఈ నేపథ్యంలో తనకు సెక్యూరిటీ పెంచాలని - హైదరాబాద్ నుంచి పనిచేసుకునేలా అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ... కేంద్ర హోం శాఖకు ఓ లేఖ రాశారన్న విషయం పెను కలకలమే రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ లేఖ నిమ్మగడ్డ రాయలేదని - టీడీపీ నేతలే ఈ లేఖను సృష్టించారని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... సదరు లేఖను తానే రాశానని చెప్పని రమేశ్ కుమార్... ఇప్పుడు నోరు విప్పేశారు. కేంద్ర హోం శాఖకు అందిన సదరు లేఖను తానే రాశానని నిమ్మగడ్డ బుధవారం సంచలన ప్రకటన చేశారు.

ఈ మేరకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బుధవారం సాయంత్రం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రం హోం మంత్రిత్వ శాఖకు సదరు లేఖను తానే రాశానని, ఈ విషయంలో థర్డ్ పార్టీ వ్యక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా నిమ్మగడ్డ సదరు ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కూడా ధృవీకరించారని కూడా నిమ్మగడ్డ తన ప్రకటనలో పేర్కొన్నారు. అయినా కేంద్ర హోం శాఖకు సమాచారం అనే విషయం తన పరిధిలోని అంశమని, ఈ నేపథ్యంలో దీనిపై వివాదం అనవసరమని కూడా నిమ్మగడ్డ పేర్కొన్నారు.

అయినా ఇప్పుడు ఈ లేఖపై నిమ్మగడ్డ ఎందుకు స్పందించాల్సిన వచ్చిందన్న దానిపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేంద్ర హోం శాఖకు ఈ లేఖ చేరిన సమయంలో వైసీపీ చేసిన ఆరోపణలకు నిమ్మగడ్డ అసలు స్పందించనే లేదు. ఈ లేఖ ఎవరు రాశారన్న విషయాన్ని నిగ్గుతేల్చాలని నాడు వైసీపీకి చెందిన కీలక నేతలు డీజీపీకి ఫిర్యాదు చేసినా కూడా నిమ్మగడ్డ నోరిప్పలేదు. తాజాగా బుధవారం ఎంట్రీ ఇచ్చిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి మరోమారు డీజీపీకి ఈ లేఖపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ ఇప్పుడు నేరుగా స్పందిస్తూ ఆ లేఖ తాను రాసిందేనని చెప్పడం గమనార్హం.
   

Tags:    

Similar News