హైకోర్టులో నిమ్మగడ్డ సంచలన పిటిషన్.. సీబీఐతో విచారణ డిమాండ్ !

Update: 2021-03-20 08:09 GMT
ఏపీలో నిమ్మగడ్డ వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా పోరు గత కొన్ని రోజులుగా జరుగుతున్న  సంగతి తెలిసిందే. ఎన్నికల పై ఏకపక్షంగా నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం వెలువడిన సమయం నుండే రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్య వార్ మాత్రం కొనసాగుతోంది. మరో 10రోజుల్లో రిటైర్ కానున్న ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో తాను జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు లీక్ అడం, తన సెలవులకు సంబంధించిన లేఖలు బయటకు రావడంపై నిమ్మగడ్డ  ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎస్ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలను ప్రతివాదులుగా చేర్చారు.  

అసలు తాను గవర్నర్‌కు రాసిన అధికార రహస్యమైన లేఖ ఎలా లీక్ అయింది. దీని ఆధారంగా అసెంబ్లీ ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వడమేంటని హైకోర్టులో ప్రశ్నించారు. అంతే కాదు ఈ లీక్‌కు కారకుల్ని తేల్చాలంటే సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో నిమ్మగడ్డ కోరారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. గవర్నర్ తో చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలు గోప్యంగా ఉండాల్సింది పోయి ఇలా బహిరంగం కావడంపై దర్యాప్తు చేయాలని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ లేఖలు లీక్‌ కావడం వల్లే అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ తనకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఈ లీకుల వ్యవహారం తేల్చాలంటే సీబీఐ దర్యాప్తు చేయించడం తప్పనిసరి అని నిమ్మగడ్డ హైకోర్టను కోరారు.

తమను హౌస్ అరెస్ట్ చేయాలంటూ ఎస్ ఈ సీ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయగా, దీనిపై బుధవారం చర్చించిన కమిటీ, గురువారం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ కార్యదర్శి ద్వారా నిమ్మగడ్డకు నోటీసులు పంపారు. అయితే, ఈ నోటీసులు తనకు వర్తించవని నిమ్మగడ్డ భావిస్త్తున్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డపై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై గత నెలలో సమావేశమైన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈనెల 17న భేటీ అయి ఆయనకు నోటీసులిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. నిమ్మగడ్డ పదవిలో ఉన్నా లేకపోయినా విచారణకు హాజరుకావాల్సిందేనని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
Tags:    

Similar News