నీర‌వ్ ను అప్ప‌గిస్తే.. మీరే జైల్లో ఉంచుతారు?

Update: 2019-05-31 07:09 GMT
బ్యాంకుల‌కు వేలాది కోట్లు ఎగ్గొట్టి విదేశాల‌కు ద‌ర్జాగా జంప్ అవుతున్న వ్యాపార దిగ్గ‌జాల‌కు షాకులు మొద‌ల‌య్యాయి. వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోడీ పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు దాదాపు రూ.13,500 కోట్ల మేర టోపీ పెట్టి విదేశాల‌కు వెళ్లిపోవ‌టం తెలిసిందే. ఆయ‌న కోసం గాలించిన పోలీసులు ఆయ‌న ఆచూకీ క‌నుగొన‌లేక‌పోయారు. ఇదిలా ఉంటే.. యూకేలో ఒక మీడియా ప్ర‌తినిధికి నీర‌వ్ మోడీ క‌నిపించ‌టం.. ఆ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడిన మాట‌ల‌తో ఆయ‌న ఉనికి ప్ర‌పంచానికి తెలిసిందే.

అనంత‌రం ఒక బ్యాంకు ఖాతా తెరిచేందుకు వెళ్లే క్ర‌మంలో ఆయ‌న్ను లండ‌న్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాటి నుంచి లండ‌న్ జైల్లో ఉంటున్న ఆయ‌న బెయిల్ కోసం ఇప్ప‌టికి మూడుసార్లు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యారు. ఇదిలా ఉంటే.. ఆర్థిక నేర‌స్తుడైన నీర‌వ్ మోడీని భార‌త్ కు అప్ప‌గించాల‌న్న అంశంపై తాజాగా లండ‌న్ లోని వెస్ట్ మినిష్ట‌ర్ మేజిస్ట్రేట్ కోర్టులో విచార‌ణ నిర్వ‌హిస్తున్నారు.

నీర‌వ్ ను భార‌త్ కు అప్ప‌గించాల‌ని భార‌త్ కోరుతున్న వేళ‌.. కోర్టు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌ను సంధించింది. నీర‌వ్ ను ఒక‌వేళ భార‌త్ కు అప్ప‌గిస్తే.. ఆయ‌న్ను మీరు జైల్లో ఉంచుతార‌ని ప్ర‌శ్నించింది. త‌మ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాల్సిందిగా లండ‌న్ వెస్ట్ మినిస్ట‌ర్ మేజిస్ట్రేట్ కోర్టు కోరింది.

త‌మ ప్ర‌శ్న‌కు స‌మాధానంతో పాటు.. రాత‌పూర్వ‌కంగా ఆయ‌న‌కు ఎలాంటి వ‌స‌తులు ఉంటాయ‌న్న విష‌యాన్ని కూడా తెల‌పాలని చెబుతూ 14 రోజుల గ‌డువు ఇచ్చింది. అయితే.. భార‌త వ‌ర్గాలు మాత్రం నీర‌వ్ మోడీని తాము ముంబ‌యిలోని అర్థ‌ర్ రోడ్డులో ఉన్న జైల్లో ఉంచుతామ‌ని బ‌దులు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.  అయితే.. అధికారికంగా లండ‌న్ కోర్టుకు నోట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై న్యాయ‌స్థానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News