ఆ మానవ మృగం సూసైడ్ చేసుకోబోయాడు

Update: 2016-08-25 10:21 GMT
దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం ఢిల్లీలో చోటు చేసుకున్న నిర్భయ ఉదంతం నేటికీ అందరికి గుర్తే. కదిలే బస్సులో పారామెడికల్ విద్యార్థినిపై పశుబలంగా అత్యంత దారుణంగా.. కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశం మొత్తాన్ని కదిలించి వేసింది. ఈ కేసులో దోషిగా నిరూపితమై జైలుశిక్ష అనుభవిస్తున్న వినయ్ శర్మ తాజాగా ఆత్మహత్యాయత్నం చేశాడు. తీహార్ జైల్లో ఉన్న వినయ్ మాత్రలు మింగి చనిపోయే ప్రయత్నం చేయటం సంచలనంగా మారింది. అతగాడి ఆత్మహత్యాయత్నాన్ని గుర్తించిన జైలుసిబ్బంది అతడ్ని దీనదయాళ్ ఆసుపత్రికి తరలించారు.

నిర్భయ ఉదంతంలో వినయ్ తో సహా ఆరుగురు వ్యక్తుల్ని కోర్టు దోషిగా తేల్చటం తెలిసిందే. వీరిలో ఒకరు మైనర్ కావటంతో పరిమిత జైలుశిక్షను విధించారు. మిగిలిన వారిని తీహార్ జైల్లో ఉంచారు. ఐదుగురు దోషుల్లో ఒకరైన రామ్ సింగ్ 2013లో ఇదే జైల్లో ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా మరో దోషి సైత ఆత్మహత్య చేసుకునే యత్నం చేయటం గమనార్హం.

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వినయ్ శర్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మానవ మృగంగా వ్యవహరించి.. ఒక అమాయక విద్యార్థిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన ఇతగాడి ఆత్మహత్యాయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జైల్లో ఉన్న ఇతడికి ఆత్మహత్య చేసుకోవటానికి అవసరమైన మాత్రలు ఎలా వచ్చాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News