నిర్భయ దోషుల ఉరిలో సంచలన ట్విస్ట్

Update: 2020-03-16 14:14 GMT
జనవరి 22 - ఫిబ్రవరి 1 - మార్చి3....ఇవన్నీ నిర్భయ అత్యాచార - హత్య కేసు నిందితులకు ఉరి శిక్ష విధించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన తేదీలు. క్యురేటివ్ పిటిషన్లు - రివ్యూ పిటిషన్లు - రాష్ట్రపతి క్షమాభిక్షలు....అన్నీ ముగియడంతో మార్చి 20న ఆ దోషులకు ఉరి ఖాయమని యావత్ దేశం ఎదురు చూస్తోంది. అయితే, తాజాగా నిర్భయ దోషులు వ్యవహారంలో సంచలన ట్విస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ ఉరి శిక్షపై స్టే విధించాలని కోరుతూ దోషులు వినయ్ శర్మ - పవన్ గుప్తా - అక్షయ్ ఠాకూర్ లు ది హేగ్‌ లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)లో పిటిషన్ దాఖలు చేశారు. దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో తమ అదృష్టం పరీక్షించుకున్న నిర్భయ దోషులు...తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానం తలుపుతట్టడం చర్చనీయాంశమైంది.`నిర్భయ` దోషులు ఐసీజేను ఆశ్రయిస్తారని ఎవరూ ఊహించలేదు.

నిర్భయ  దోషులు ఉరి శిక్ష అమలులో జాప్యం కోసం సరికొత్త దారులు వెతుక్కుంటున్నారు. నాలుగో సారి ఉరి తప్పదనుకుంటున్న ఈ తరుణంలో దోషులు ఓ వింత పిటిషన్‌ వేశారు. అంతర్జాతీయ వివాదాలను తీర్చే న్యాయస్థానమైన ది హేగ్‌ లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)ను నిర్భయ దోషులు ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్ ను అంతర్జాతీయ న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్న విషయంపై స్పష్టత రాలేదు. కాగా, భారత న్యాయ వ్యవస్థలోని లోపాలను నిర్భయ దోషులు ఉపయోగించుకున్నంతగా మరెవరూ ఉపయోగించుకోలేదంటే అతిశయోక్తి కాదు. కొన `సాగు`తోన్న నిర్భయ దోషుల ఉరిశిక్ష తేదీలను చూసి దేశ ప్రజలు విసిగెత్తారు. మార్చి 20న వారికి దాదాపు ఉరి ఖాయమనుకుంటున్న తరుణంలో....తాజా ట్విస్ట్ తో దేశ ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోంది.


Tags:    

Similar News