హైవే ప్రాజెక్టుల్లోకి చైనాకు నో ఎంట్రీ

Update: 2020-07-02 01:40 GMT
సరిహద్దుల్లో చైనాను గట్టిగా ఎదుర్కొన్న భారత్‌ తాజాగా చైనా ‌ను వ్యాపార కార్యకలాపాలపరంగా కూడా కట్టడి చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా చైనా సంస్థలను జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల్లో అనుమతించకుండా చర్యలు తీసుకుంటోంది. జాయింట్‌ వెంచర్ల ద్వారా సైతం చైనీస్‌ సంస్థలకు అనుమతులు ఉండబోవంటూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. అలాగే, లఘు, చిన్న, మధ్యతరహా సంస్థల్లాంటి పలు రంగాల్లో చైనా ఇన్వెస్టర్లకూ ఎంట్రీ ఉండబోదని, చైనా భాగస్వాములు ఉన్న జాయింట్‌ వెంచర్‌ సంస్థలకు రహదారుల నిర్మాణ ప్రాజెక్టులకి అనుమతించం అని మంత్రి తెలిపారు.

చైనా సంస్థలను నిషేధిస్తూ, హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనేలా దేశీ కంపెనీల అర్హత ప్రమాణాలను సడలించేందుకు త్వరలోనే విధానాన్ని ప్రకటించనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టుల్లో మాత్రమే కొంత మేర చైనా భాగస్వామ్య సంస్థలు ఉన్నాయన్నారు. కొత్త నిబంధనలు ప్రస్తుత, భవిష్యత్‌ టెండర్లకు వర్తింపచేస్తామని తెలిపారు. ఇక టెండర్ల విషయానికొస్తే.. చైనా జాయింట్‌ వెంచర్లున్న వాటికి సంబంధించి రీబిడ్డింగ్‌ ఉంటుందని గడ్కరీ చెప్పారు.

ప్రస్తుత నిర్మాణ నిబంధనలు సరిగ్గా లేవు. భారతీయ కంపెనీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాటిని మారుస్తున్నాం అని గడ్కరీ వివరించారు. ప్రాజెక్టుల కోసం విదేశీ సంస్థలతో జాయింట్‌ వెంచర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా నిబంధనలను క్రమబద్ధీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ టెక్నాలజీ, కన్సల్టెన్సీ లేదా డిజైన్‌ వంటి విభాగాల్లో జేవీలు అవసరమైనా, చైనా సంస్థలకు మాత్రం అనుమతి ఉండబోదన్నారు.

దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అదే సమయంలో ఎంఎస్ ‌ఎంఈల్లోకి విదేశీ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తున్నామని గడ్కరీ చెప్పారు. అయితే, ఈ విషయంలో చైనా ఇన్వెస్టర్లను మాత్రం అనుమతించబోమన్నారు.మరోవైపు, చైనా నుంచి వచ్చిన కన్‌ సైన్ ‌మెంట్స్‌ ను భారతీయ పోర్టుల్లో అధికారులు నిలిపివేస్తున్నారన్న వార్తలపై స్పందిస్తూ ... స్వయం సమృద్ధి సాధించే దిశగా దేశీ వ్యాపారాలు, ఎంఎస్‌ ఎంఈలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోందని, సాధారణంగానే చైనా నుంచి దిగుమతులను తగ్గాలనుకుంటోందని తెలిపారు.
Tags:    

Similar News