నితీశ్ కేబినెట్‌ లో ఎవ‌రెవ‌రుంటారంటే....

Update: 2015-11-10 16:36 GMT
బీహార్‌లో దుమ్మురేపే స్థాయిలో విజ‌యం సాధించి దేశం చూపును త‌న‌వైపు తిప్పుకున్న నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు?  కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటుచేయ‌నున్న నితీశ్ ఏ పార్టీకి ఎన్ని మంత్రి ప‌ద‌వులు కేటాయిస్తారు? అనే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు స‌మాధానం దొరికింది.

ప్రధాన పండుగలైన దీపావళి, నవంబర్‌ 17న చాత్ పండుగ‌ అనంతరమే కొత్త సర్కారు ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈనెల 20న పాట్నాలో నితీశ్‌ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో మహాకూటమిలో లాలూ , అలాగే కాంగ్రెస్‌ కు మంత్రిపదవులు దక్కనున్నాయి. విశ్వసనీయ వర్గాల స‌మాచారం ప్ర‌కారం ఐదుగురు ఎమ్మెల్యేలకు ఓ  కేబినెట్ మంత్రి పదవి ఇవ్వాలని నితీశ్‌ భావిస్తున్నట్లు స‌మాచారం. 20న నితీశ్‌ తన క్యాబినేట్‌ లోకి తొలిగా 36మందిని తీసుకునేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. వీరంతా ఆ రోజునే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆర్జేడీనుంచి 16 మంది, జేడీయూనుంచి 15 మంది కాంగ్రెస్‌ నుంచి 5 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయమై ఇప్పటికే తన భాగస్వామ్య పక్షాలకు నితీశ్ చేర‌వేశారు.

లాలూ ప్రసాద్‌ సారథ్యంలోని ఆర్జేడీ 80 సీట్లు గెలుచుకున్నందున, నితీశ్‌ పార్టీ కంటే అదనంగా 9 మంది మంత్రి పదవులు దక్కే వీలుంది. కాంగ్రెస్‌ 27 సీట్లు గెలుచుకున్నందున కొన్ని కీలకమైన శాఖలు అడుగనున్నారు. అయితే రోడ్లు,ఆరోగ్యం, విద్యుత్‌, విద్య లాంటి కీలకమైన శాఖలు నితీశ్‌ తన పార్టీకే ఉంచుకోనున్నారు. మ‌రోవైపు  నితీశ్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.
Tags:    

Similar News