నితీశ్ మ‌రో రికార్డు

Update: 2015-11-10 06:17 GMT
బీహార్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఎన్డీఏను మ‌ట్టిక‌రిపించి జేడీయూ నేతృత్వంలోని మ‌హాకూట‌మిని ఒంటి చేత్తో గెలిపించి స‌త్తా చాటిన బీహార్ ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ ఈ ఫ‌లితాల‌తో రాజ‌కీయ విశ్లేష‌కుల‌ చూపు త‌న‌వైపు తిప్పుకున్నారు. మోడీ మానియాను దెబ్బ‌కొట్ట‌గ‌లిగిన నాయ‌కుడిగా ఇప్ప‌టికే పేరు సంపాదించుకున్న నితీశ్‌....మ‌రో రికార్డుకు సాధించ‌నున్నారు.

ఈ ద‌ఫా నితీశ్‌ కుమార్ సీఎంగా ప్ర‌మాణం చేయ‌బోయేది ముచ్చటగా మూడోసారి అనే సంగతి తెలిసిందే. అయితే మళ్లీ శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ)గానే సీఎం పీఠాన్ని నితీశ్‌ అధిష్టించనున్నారు. తొలి రెండు పర్యాయాలు ఆయన శాసనమండలి నుంచే ప్రాతినిధ్యం వ‌హించ‌డం గ‌మ‌నార్హం. బీహార్‌ ఎన్నికలలో నితీశ్‌ ఈసారి కూడా పోటీ చేయలేదు. 2005 నవంబర్‌ 24న తొలిసారిగా సీఎం అయ్యేనాటికి ఆయన పార్లమెంట్‌ లో జ‌న‌తాద‌ళ్‌ (యు) పక్షనేతగా కొనసాగుతున్నారు. సీఎం అయిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2009లోనూ రెండోసారి నితీశ్‌ కుమార్‌ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2010 ఎన్నికలలోనూ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయకుండానే సీఎం అయ్యారు. ప్ర‌స్తుతం కూడా ఎమ్మెల్సీగా సీఎం ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నారు.

బీహార్‌ నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన నితీశ్‌ కేంద్ర మంత్రిగా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. మూడు సార్లు సీఎం - ఆరు సార్లు ఎంపీ - మూడు ద‌ఫాలుగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఘ‌న‌త నితీశ్ సాధించ‌నున్నారు.
Tags:    

Similar News