సినీ ఫ‌క్కీలో టిఫిన్ బాక్స్ దొంగ‌తనం!

Update: 2018-09-07 08:46 GMT
గ‌త సోమ‌వారం నాడు పాత‌బ‌స్తీలోని నిజాం మ్యూజియంలో సినీ ఫ‌క్కీలో జ‌రిగిన దొంగ‌త‌నం తీవ్ర క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. మస్రత్‌ మహల్‌ లో ఉన్న‌ నిజాం మ్యూజియంలోఉన్న అత్యంత విలువైన బంగారంతో చేసిన టిఫిన్‌ బాక్స్ - టీ కప్పు - సాసర్ - స్పూన్ ల‌ను ఇద్ద‌రు దొంగ‌లు అత్యంత చాక‌చ‌క్యంగా కొల్ల‌గొట్టిన వైనం చూసి పోలీసులు విస్తుపోయారు. ఆ కేసులో విచార‌ణ జ‌రిపిన పోలీసులకు కీల‌క‌మైన ఆధారాలు ల‌భించాయి. దొంగ‌త‌నం చేసేముందు ఆ ఇద్ద‌రు దొంగ‌లు ప‌క్కాగా రెక్కీ నిర్వ‌హించి....మార్కింగ్ లు పెట్టుకున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఆ టిఫిన్ బాక్స్ ఉన్న గ్యాలరీలో దిగడానికి మ్యూజియం పైకప్పుపై మూడుచోట్ల మార్కింగ్‌ పెట్టుకొని ప‌క్కా స్కెచ్ వేసిన‌ట్లు గుర్తించారు. మ్యూజియంపైకి ఏ విధంగా ఎక్కాలి....ఆ మార్కింగ్ వేసిన ద‌గ్గ‌ర నుంచి లోప‌లికి ఎలా దిగాలి....ఆ గ్యాల‌రీ ఉన్న  వెంటిలేటర్ వద్దకు ఎలా వెళ్లాలి... సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి....ఇలా అన్ని విష‌యాలు క్షుణ్ణంగా ప‌రిశీలించిన త‌ర్వాతే దొంగ‌త‌నం చేశారు.

సోమ‌వారం తెల్లవారుజామున మ్యూజియం ప్రహరీ వెనుక వైపు ఉన్న ప్రార్థనా స్థలం ద‌గ్గ‌ర‌కు బైక్‌ పై చేరుకున్న దొంగ‌లు....రెక్కీ నిర్వ‌హించి ప‌రిస్థితిని స‌మీక్షించాడు. ఆ త‌ర్వాత 3.20 నిమిషాల ప్రాంతంలో మ్యూజియం వెనుక వైపు ఉన్న ఇళ్ల పైకప్పుల నుంచి అనుసంధానించి ఉన్న పురాతన ఇనుప మెట్లను వినియోగిస్తూ మ్యూజియం పైకి వెళ్లారు. అంత‌కుముందు చేసిన మార్క్‌ ల ఆధారంగా మూడో గ్యాలరీ వెంటిలేటర్ ద‌గ్గ‌ర‌కు చేరుకున్నారు. ప్రత్యేక గమ్‌ అతికించిన అద్దాన్ని తొలగించి పక్కన పెట్టి....ఇనుప గ్రిల్‌ కు లోపలి వైపు నుంచి కొట్టిన మేకుల్ని తొలగించారు. గ్రిల్‌ ను అద్దం పెట్టిన వైపు కాకుండా మరో వైపు పెట్టారు. ఆ త‌ర్వాత‌ తాడు సాయంతో మూడో గ్యాలరీలోకి ఒక దొంగ‌ ప్ర‌వేశించాడు. బంగారం టిఫిన్‌ బాక్స్‌ ఉన్న ర్యాక్ అద్దాలు ప‌గ‌ల‌కుండా....చిన్న రాడ్ సాయంతో వాటి త‌లుపు బోల్ట్‌ లు విరిగిపోయేలా చేశాడు. ఆపై దర్జాగా టిఫిన్‌ బాక్స్ - టీ కప్పు - సాసర్ - స్పూన్‌ తీసుకుని తన బ్యాగ్‌ లో సర్దుకుని జారుకున్నారు. 5.20 గంటల ప్రాంతంలో మాస్క్ లు ధ‌రించిన ఆ ఇద్దరు దొంగ‌లు అదే ప్రార్థనా స్థలం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి బైక్ పై పారిపోయారు. లోప‌లికి దిగిన దొంగ‌ ఎడమ కాలికి గాయం కావ‌డంతో కుంటుతున్నట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌యింది.
Tags:    

Similar News