ఆర్టీసీ ర్యాలీలో నిజాం కాలం నాటి బస్సు.. వైరల్

Update: 2022-08-14 05:39 GMT
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) శనివారం ఇక్కడ నిర్వహించిన బస్సుల ర్యాలీలో యూకేకు చెందిన అల్బియాన్ కంపెనీ తయారు చేసిన నిజాంల కాలం నాటి బస్సు ఆకర్షణీయంగా నిలిచింది. 1932లో నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (ఎన్‌ఎస్‌ఆర్‌ఆర్‌టిడి) ప్రవేశపెట్టిన 27 బస్సుల మొదటి ఫ్లీట్‌లో భాగమైన రెడ్ కలర్ బస్సు మరమ్మతులు చేసి జాతీయ జెండాలతో అలంకరించారు. 19-సీట్ల బస్సు అప్పుడు 'నాందేడ్'కు వెళ్లేది. ఆ నేమ్ ప్లేట్ కూడా అలానే ఉంది. ఈ నిజాంల కాలం నాటి బస్సును ముందు భాగంలో ఆర్టీసీ ప్రముఖంగా ప్రదర్శించింది.

నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్‌పై ఈ బస్సుల ర్యాలీని నిర్వహించారు.  ఈ పురాతన బస్సును దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అప్పటి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆర్టీసీకి అప్పగించింది. టీఎస్ ఆర్టీసీ ఏర్పడినప్పుడు విలువైన ఈ బస్సును అలాగే భద్రపరిచారు. ఆర్టీసీ కార్పొరేషన్ యొక్క ప్రధాన కార్యాలయమైన బస్ భవన్ వెలుపల ఈ బస్సును ప్రదర్శనకు పెట్టారు. ఆర్టీసీ ర్యాలీలో భాగమైన బస్సులలో ప్రస్తుతం గరుడ మరియు రాజధాని లగ్జరీ బస్సులు ఈ ర్యాలీలో ఉన్నాయి.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో భాగంగా నిర్వహించబడిన ఈ ర్యాలీలో కార్పొరేషన్ సుదీర్ఘ చరిత్రను హైలైట్ చేశారు. మ్యూజిక్ బ్యాండ్‌లు, మోటార్ సైకిళ్లతో కూడిన కవాతును రోటరీ పార్కు వద్ద వివేకానంద విగ్రహం వద్ద జెండా ఊపి అంబేద్కర్ విగ్రహం వద్ద ముగించారు.

నిజాం రాజు నాడు హైదరాబాద్ సంస్థానం వ్యాప్తంగా ప్రజా రవాణా కోసం బ్రిటన్ నుంచి 27 బస్సులను తెప్పించి నడిపించారు. హైదరాబాద్ నుంచి నాందేడ్ కు వెళ్లే ఈ బస్సులో 19 మంది కూర్చోవడానికి సీటింగ్ కెపాసిటీ ఉంది. మహారాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్ వరకూ నాడు నిజాంల పాలనలోనే ఉండేది. స్వాతంత్ర్యం వచ్చాక నిజాంల ఆక్రమణలోని మరాఠీ ప్రాంతాన్ని మహారాష్ట్రలో విలీనం చేశారు. కొన్నింటిని కర్ణాటకలో కలిపారు. తెలుగు మాట్లాడే తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేశారు.నిజాంల ఆస్తులు చాలా వరకూ తెలంగాణ రాష్ట్రానికే చెందాయి. ఇక్కడే పురాతన ఆనవాళ్లుగా మిగిలిపోయాయి.
Tags:    

Similar News