నెంబర్ టూ గండమే..లోకేశ్ కు దెబ్బేసిందా?

Update: 2019-05-27 14:30 GMT
37 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం కలిగిన తెలుగు దేశం పార్టీలో పార్టీ అధినేత తర్వాత ప్లేస్ ఎవరిదన్న విషయం ఎప్పుడూ చర్చకు రాదు. వచ్చిందో ఇక ఆ ప్లేస్ లో ఉన్న నేత ఖల్లాస్ కావడం ఖాయమే. ఇదేదో అదాటుగా చెబుతున్న మాట ఎంతమాత్రం కాదు. పార్టీ ఆవిర్భావం నుంచి నెంబర్ టూ నేతలుగా చెలామణిలోకి వచ్చి... అడ్రెస్ లేకుండా పోయిన నేతలను చూసి మరీ చెబుతున్న మాట. ఆది నుంచి టీడీపీలో నెంబర్ టూ నేతగా ఎదిగిన వారంతా ఆ తర్వాత ఎందుకూ కొరగాకుండా పోయారు. ఇప్పుడు తాజాగా పార్టీ చీఫ్ నారా చంద్రబాబునాయుడు కుమారుడు - మంత్రిగా వ్యవహరించిన నారా లోకేశ్ కు కూడా అదే పరిఃస్థితి ఎదురైందని చెప్పక తప్పదు.

ఇలా నెంబర్ టూ స్థాయికి ఎదిగిన నేతలు - వారి భవిష్యత్తు ఏమైందన్న వివరాలను ఓ సారి పరిశీలిద్దాం పదండి. స్వర్గీయ నందమూరి తారకరామారావు టీడీపీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపడితే... నాడు ఎన్టీఆర్ కు అన్నీ తానై వ్యవహరించిన నాదెండ్ల భాస్కరరావు... పార్టీలో నెంబర్ టూగా ఎదిగారు. అయితే ఎన్టీఆర్ ను పదవీఛ్యుతుడిని చేయడం, ఆ తర్వాత ఎన్టీఆర్ తిరిగి అదికారం చేపట్టంతో నాదెండ్ల భవిష్యత్తు గంగలో కలిసిపోయింది. ఆ తర్వాత నాదెండ్ల అసలు రాజకీయాల్లోనే కనిపించలేదు. ఏదో ఏపీకి కొన్ని రోజుల పాటు సీఎంగా వ్యవహరించారని నాదెండ్లను గుర్తు చేసుకోవడం మినహా... ఆ తర్వాత నాదెండ్ల పెద్దగా రాణించిన దాఖలా లేదు.

ఎన్టీఆర్ ను రెండో వివాహం చేసుకున్న లక్ష్మీ పార్వతి కూడా అనధికారికంగా ఎన్టీఆర్ తర్వాతి ప్లేస్ తనదేనన్న శైలిలో రెచ్చిపోయారనే చెప్పాలి. అయితే ఎన్టీఆర్ మరణం తర్వాత ఆమె ఎందుకూ కొరగాకుండా పోయారు. ఇక పార్టీని ఎన్టీఆర్ ను చంద్రబాబు లాగేసుకున్న తర్వాత ఎన్టీఆర్ తనయుడిగా నందమూరి హరికృష్ణ పార్టీలో నెంబర్ బూ గా ఎదిగారు. అయితే హరికృష్ణ ఎంత ఎదిగితే... తనకు అంత ఇబ్బంది అన్న భావనతో ఆయనను ఎక్కడికక్కడ తొక్కేసిన చంద్రబాబు.. రాజకీయాల్లోనే అేకుండా చేసి పారేశారు.

ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి హోం శాఖ మంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవ రెడ్డి కూడా చంద్రబాబు తర్వాత ప్లేస్ నేతగా ఎదిగారు. అయితే ఆయన నక్సల్స్ చేతుల్లో హత్యకు గురయ్యారు. ఇక ఆ తర్వాత మాధవరెడ్డి ప్లేస్ లోనే హోం మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తూళ్ల దేవేందర్ గౌడ్... టీడీపీ సర్కారు కూలిపోగానే అడ్రెస్ లేకుండా పోయారు. తెలంగాణ కోసం ఓ పార్టీని పెట్టినా పెద్దగా రాణించలేక పలు పార్టీలు మారిన ఆయన చివరికి టీడీపీ చెంతకే చేరి అలా ఓ పక్కన ఉండిపోయారు.

ఈ నేపథ్యంలో అసలు టీడీపీలో నెంబర్ టూ ప్లేస్ అంటే అందరూ హడలిపోయేంతగా పరిస్థితి మారిపోయింది. దీంతో ఓ పదేళ్ల పాటు ఈ ప్లేస్ ను ఆశించిన నేతే కనిపించలేదు. అయితే చంద్రబాబు కుమారుడిగా తెరంగేట్రం చేసిన నారా లోకేశ్... అదే నెంబర్ టూ ప్లేస్ లోకి వచ్చేశారు. అయితే ఆ ప్లేస్ కు ఉన్న శని కారణంగానే... టీడీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా... మంగళగిరిలో లోకేశ్ ఓటమి పాలయ్యారు. అంతిమంగా చెప్పొచ్చేదేమంటే... నెంబర్ టూ గండమే లోకేశ్ కు దెబ్బేసిందన్న మాట.
Tags:    

Similar News