గుజ‌రాత్ సీఎం కుర్చీలో స్మృతి.. ఛాన్సే లేదా?

Update: 2017-12-19 08:30 GMT
రాజ‌కీయ వార్త‌ల‌కు ఉండే గొప్ప గుణం.. అది ఎలాంటిదైనా చ‌దివించేలా చేస్తుంది. ఇక‌.. స‌ద‌రు వార్త‌లో లాజిక్ మిస్ కాకుండా ఉంటే నిజ‌మే క‌దా? అనిపించటం ఖాయం. అయితే.. కొన్ని సంద‌ర్భాల్లో ఎలాంటి లాజిక్ లేకుండా టైమ్లీగా వార్త‌ల్ని వ‌డ్డించే విధానం ఈ మ‌ధ్య‌న మొద‌లైంది. సంచ‌ల‌నంగా అనిపించేలా ఒక‌ట్రెండు అంశాల్ని క‌లిపేసి.. ఇలా సాధ్య‌మ‌వుతుంది గురూ అన్న‌ట్లు చెప్పే వార్త‌లు ఈ మ‌ధ్య‌న ఎక్కువ‌య్యాయి. ఇవి సోష‌ల్ మీడియాలోనే కాదు.. మొయిన్ స్ట్రీం మీడియాలోనూ ఎక్కువ‌య్యాయి. అలాంటి వార్తే ఒక‌టి ప్ర‌ముఖంగా ప్ర‌చురిత‌మైంది.

గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో గుజ‌రాత్ త‌దుప‌రి సీఎం ఎవ‌ర‌న్న దానికి స‌మాధానంగా కేంద్ర‌మంత్రి.. ప్ర‌ధానికి మోడీ టీంలో ముఖ్య‌మైన వారిలో ఒక‌రైన స్మృతి ఇరానీ అంటూ పేరు రాసేశారు. ఎక్క‌డ స్మృతి.. ఎక్క‌డ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి. అలా అని ఆమె సీఎం ప‌ద‌వికి సూట్ కావ‌ట్లేద‌ని అన‌టం లేదు. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఆమెకు ఛాన్సే లేద‌ని చెప్ప‌ట‌మే ఇక్క‌డ ఉద్దేశం.

ఎందుకంటే.. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా సీట్లో కూర్చోబెట్టాలంటే లెక్క‌లు చాలానే ఉంటాయి. అందులోకి కిందామీదా ప‌డిన గుజ‌రాత్ లాంటి రాష్ట్రానికి సీఎంగా చేయ‌బోయే వ్య‌క్తి విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు చాలానే ఉంటాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు జాతీయ రాజ‌కీయాల మీద దృష్టి పెట్టిన నాటి నుంచి గుజ‌రాత్ రాష్ట్ర అంశాల్ని ప‌క్క‌న పెట్టారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌టంతో  సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు మోడీ. నాటి నుంచి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన వారు త‌మ‌దైన ముద్ర‌ను వేయ‌లేక‌పోయారు.

ఇలాంటి వేళ జ‌రిగిన ఎన్నిక‌ల్లో చాలా త‌క్కువ మెజార్టీతో విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ నేప‌థ్యంలో గుజ‌రాత్ పీఠాన్ని క‌ట్ట‌బెట్టే వ్య‌క్తికి సంబంధించి లెక్క‌లెన్నో ఉంటాయి. ఇక‌.. స్మృతి సీఎం అంటూ వ‌స్తున్న వార్త‌ల్లో నిజానిజాల్ని చూస్తే.. ఈ వార్త‌ను మొద‌ట వండింది ఇండియా టుడే గ్రూపుకు సంబంధించిన సంస్థ‌లు. ఆ వార్త‌ను ఆధారంగా చేసుకొని ప్రాంతీయ మీడియా సంస్థ‌లు సైతం.. అవున‌వును.. స్మృతిని గుజ‌రాత్ సీఎంను చేసే ఛాన్స్ ఉంద‌న్న వార్త‌ను అచ్చేస్తున్నారు.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు. ఆ విష‌యంలో మ‌రో మాట లేదు. కానీ.. స్మృతిని గుజ‌రాత్ సీఎంగా చేయాలంటే క‌నీసం కొన్ని అంశాలైనా ఆమెకు సానుకూలంగా ఉండాలి క‌దా. అదెలానంటే స్మృతి  బేసిగ్గా గుజ‌రాతీ కాదు. ఆమె పుట్టింది.. పెరిగింది.. చ‌దువుకున్న‌ది.. త‌ర్వాతి సినిమాల్లో వేషాల కోసం ప్ర‌య‌త్నం చేసింది ముంబ‌యిలోనే. ఆమె త‌ల్లిదండ్రుల్లో అయినా గుజ‌రాతీ మూలాలు ఉన్నాయా? అంటే అదీ లేదు. త‌ల్లి బెంగాలీ కాగా.. తండ్రి పంజాబీ. ఇవ‌న్నీ వ‌దిలేసినా..పెళ్లి అయినా గుజ‌రాతీని చేసుకున్నారా? అంటే అదీ లేదు. ఆమె భ‌ర్త  ఢిల్లీకి చెందిన ఓ పార్శీ.

ఇలా ఏ యాంగిల్‌లో చూసినా స్థానికత లేని నేత‌ను సీఎంగా చేస్తే ఎలా ఫిట్ అవుతార‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌. ఇక‌.. ఆమె ప‌ని తీరు అత్య‌ద్భుత‌మా అంటే లేద‌నే చెప్పాలి. మొద‌ట ఇచ్చిన మాన‌వ‌వ‌న‌రుల శాఖ‌ను కుదించిన వైనాన్ని మ‌ర్చిపోలేం. మోడీకి క్లోజ్ కావ‌టం.. అమేధీ నుంచి పోటీ చేసి రాహుల్ లాంటోడికి అంతోఇంతో ముచ్చ‌మ‌ట‌లు పోయించ‌టంతో ఆమెకు త‌గు స్థానం ఇవ్వాల‌న్న ఉద్దేశంతో కేంద్ర‌మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. అమేథీలో బ‌రిలోకి దింపి ఆమె గొంతు కోశార‌న్న చెడ్డ‌పేరు తెచ్చుకోవ‌టం ఇష్టం లేని మోడీ.. తెలివిగా ఆమెకు కేంద్ర‌మంత్రి ప‌ద‌వి అప్ప‌గించ‌టం ద్వారా పోరాడి ఓడిన నారికి మోడీ మాష్టారు పెద్ద పీట వేశార‌న్న పేరును తెచ్చుకున్నారు. అంతే త‌ప్పించి స్మృతికి గుజ‌రాత్ సీఎం అయ్యే చాన్స్ లేద‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల వాద‌న‌. ప్రాంతీయ భావ‌న‌లు అధికంగా ఉండే గుజ‌రాత్ సీఎం కుర్చీలో ఆ ప్రాంతానికి చెంద‌ని వారిని తీసుకొచ్చి పెడితే ఇంకేమైనా ఉంటుందా? ఎవ‌రికి రాని స‌రికొత్త ఐడియా మోడీకి వ‌స్తే చెప్పలేం కానీ.. వాస్త‌వ అంశాల్ని పరిగ‌ణ‌లోకి తీసుకుంటే మాత్రం ఆమెకు గుజ‌రాత్ సీఎం కుర్చీ సాధ్య‌మే కాదు.
Tags:    

Similar News