మోడీ నిర్ణ‌యంతో చివ‌రి ఉమ్మ‌డి బంధం తెగింది!

Update: 2019-07-17 05:30 GMT
అర‌వైఏళ్ల‌కు పైనే క‌లిసి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఐదేళ్ల‌కు పైనే అవుతోంది. అయిన‌ప్ప‌టికీ.. గ‌తానికి సంబంధించిన కొన్ని బంధాలు విభ‌జ‌న త‌ర్వాత కూడా కొన‌సాగాయి. ఉమ్మ‌డి రాజ‌ధాని.. ఉమ్మ‌డి హైకోర్టు.. ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ లాంటివెన్నో ఉన్నాయి. గ‌డిచిన ఐదేళ్ల‌లో ఒక్కొక్క‌టిగా ఉన్న ఉమ్మ‌డి బంధాలు తెగుతూ వ‌చ్చాయి.

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న న‌ర‌సింహ‌న్ ను తెలంగాణ రాష్ట్రానికే ప‌రిమితం చేస్తూ.. ఏపీకి బిశ్వ భూష‌ణ్ హ‌రిచంద‌న్ ను ఏపీ గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మిస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో.. న‌ర‌సింహ‌న్‌ కు ఉన్న ఉమ్మ‌డి ప‌ద‌వుల్లో ఒక‌టి పోగా.. మ‌రొక‌టి నిలిచింది. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న చివ‌రి ఉమ్మ‌డి బంధం కూడా తెగిపోయింద‌ని చెప్పాలి. ఉమ్మ‌డి రాజ‌ధానిగా ప‌దేళ్లు కొన‌సాగాల్సిన హైద‌రాబాద్‌.. చంద్ర‌బాబు పుణ్య‌మా అని ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన కొద్ది స‌మ‌యానికే అమ‌రావ‌తికి వెళ్లిపోయారు. ఆయ‌న వెంట‌నే స‌చివాల‌యం త‌ర‌లిపోయింది.

అలా బంధాలు ఒక్కొక్క‌టిగా తెగినప్ప‌టికీ.. రాష్ట్ర హైకోర్టు.. గ‌వ‌ర్న‌ర్ విష‌యంలో మాత్రం సాగుతూనే ఉంది. ఈ మ‌ధ్య‌నే రెండు హైకోర్టులు వేర్వేరు అయ్యాయి.ఇక‌.. చివ‌రిగా ఉన్న ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి సైతం చెల్లుచీటి ఇచ్చేసిన ప్ర‌ధాని మోడీ.. రెండు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ల‌ను వేర్వేరుగా ఉంచాల‌ని నిర్ణ‌యించారు.

ఐదేళ్ల క్రితం అధికారికంగా విభ‌జ‌న జ‌రిగిపోయిన‌ప్ప‌టికీ.. కొన్ని లింకులు ఉమ్మ‌డి రూపంలో మిగిలి ఉన్నాయి. తాజాగా అది కూడా తెగిపోయింది. ఇక‌పై ఉమ్మ‌డిగా ఏదీ లేద‌ని చెప్పాలి. ఇక‌.. రెండు రాష్ట్రాల మ‌ధ్య కొన్ని వివాదాలు పెండింగ్ లో ఉన్న‌ప్ప‌టికీ.. రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల మ‌ధ్య ఉన్న అనుబంధం కార‌ణంగా.. సామ‌ర‌స్య వాతావ‌ర‌ణంలోనే అవ‌న్నీ కొలిక్కి రావ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. సో.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య‌నున్న చివ‌రి ఉమ్మ‌డి బంధం ఇలా తెగిపోయింద‌న్న మాట‌. 
Tags:    

Similar News