కేంద్రం కీల‌క నిర్ణ‌యం..అమిత్‌ షా క్లారిటీ!

Update: 2019-12-24 16:12 GMT
కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జాతీయ జ‌నాభా పట్టిక(National Population Register-NPR)ను కేంద్ర ప్ర‌భుత్వం అప్‌ డేట్ చేయ‌నుంది. ఇవాళ స‌మావేశ‌మైన కేంద్ర క్యాబినెట్ నేష‌న‌ల్ పాపులేష‌న్ రిజిస్ట‌ర్‌(ఎన్‌ పీఆర్‌)కు అనుమ‌తి ఇచ్చింది. జ‌నాభా వివ‌రాల్లో ప్ర‌తి పౌరుడు భౌగోళిక‌ - బ‌యోమెట్రిక్ వివ‌రాలు ఉంటాయి. ఎన్‌ పీఆర్ చేయాలంటే.. పౌరులు ఎవ‌రైనా ఒక ప్రాంతంలో ఆరు నెల‌ల క‌న్నా ఎక్కువ స‌మ‌యం ఉన్న‌వారే అర్హులు. డేటా సేక‌ర‌ణ కోసం సుమారు 8500 కోట్లు ఖ‌ర్చు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

మ‌రోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మీడియాతో మాట్లాడుతూ...జాతీయ పౌరపట్టిక(ఎన్‌ ఆర్సీ).. జాతీయ జనాభా పట్టిక(ఎన్‌ పీఆర్‌)కు సంబంధం లేదని వెల్ల‌డించారు. ``జనాభా లెక్కల కోసమే ఎన్‌ పీఆర్‌. ఎన్‌పీర్‌ విషయంలో విపక్షాలు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయి. సీఏఏలో ఎవరి పౌరసత్వం లాక్కునే ప్రసక్తే లేదు.  ప్రధాని నరేంద్ర మోదీ చెప్పింది నిజమే. జనాభా పట్టిక వివరాలను జాతీయ పౌరపట్టికకు ఉపయోగించరు. 2021 ఫిబ్రవరిలో జనగణన - ఎన్‌ పీఆర్‌ చేపడతాం. ఎన్‌ పీఆర్‌ లో పేరు గల్లంతైనా వారి పౌరసత్వానికి ఢోకా లేదు. ఆందోళనలు చల్లార్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. దుష్ప్రచారం చేసే వారితో మైనార్టీలు - పేదలకు నష్టం జరుగుతుంది. మీరు దేశ పౌరులా? అనే ప్రశ్నలు ఎన్‌ పీఆర్‌ లో ఉండవు. `అని క్లారిటీ ఇచ్చారు.

ఎన్‌ ఆర్సీపై అమిత్‌ షా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 'దేశవ్యాప్తంగా ఎన్‌ ఆర్సీపై ఇప్పుడు చర్చ అవసరం లేదు.  కేబినెట్‌ సమావేశంలో కానీ, పార్లమెంట్‌ లో కానీ చర్చ జరగలేదు. 2010లోనే యూపీఏ ప్రభుత్వం ఎన్‌ పీఆర్‌ ప్రక్రియ చేపట్టింది. ఎన్‌ పీఆర్‌ ను యూపీఏ ప్రభుత్వమే తీసుకువచ్చింది. అప్పుడు దీనిపై ఎవరూ ప్రశ్నించలేదు.. ఇప్పుడెందుకు అడుగుతున్నారు? కేరళ -  పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ర్టాలకు సీఏఏతో ఉపయోగం ఉంటుంది. సీఏఏను వ్యతిరేకించాలన్న ఉద్దేశాన్ని ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు పునఃపరిశీలించాలి. మీ రాజకీయాల కోసం పేదలను ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి దూరం చేయకండి` అని అమిత్‌ షా పేర్కొన్నారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై అమిత్‌ షాతో ఏఎన్‌ఐ వార్తా సంస్థ ముఖాముఖీ నిర్వహించిన సంద‌ర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్య‌లు చేశారు.
Tags:    

Similar News