గాంధీ, నెహ్రూల పేర్ల‌ను లేపేశారు!

Update: 2017-08-02 04:08 GMT
మ‌హాత్మా గాంధీ... భార‌త స్వాతంత్య్ర సంగ్రామంలో ముందుండి దేశ జ‌నాన్ని న‌డిపించారు. అహింసా ప‌ద్ధ‌తిలో అలుపెర‌గ‌ని రీతిలో పోరు సాగించిన గాంధీజీ... బ్రిటిష‌ర్ల‌ను దేశం నుంచి వెళ్లగొట్టేశారు. ఇక గాంధీకి వెన్నంటి న‌డవ‌డ‌మే కాకుండా దేశ‌వ్యాప్తంగా ఉద్య‌మాన్ని ఓ ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో ముందుకు న‌డిపే ఉద్దేశంతో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీలో కీల‌క భూమిక పోషించిన పండిట్ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ స్వాతంత్య్ర స‌మ‌రంలో త‌న వంతు పాత్ర‌ను పోషించారు. అంతేకాకుండా స్వ‌తంత్ర భార‌తావ‌నికి నెహ్రూ ప్ర‌ప్ర‌థ‌మ ప్రధానమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. దేశంలో పాల‌న‌ను ప‌క్కాగా ప‌ట్టాలెక్కించ‌డంలో ఆయ‌న స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి. ఇక భార‌త రాజ్యాంగ ర‌చ‌న‌లో కీల‌క భూమిక పోషించిన బాబా సాహెబ్ అంబేద్క‌ర్ ను కూడా మ‌నం మ‌రిచిపోలేం. అంటే దేశ చ‌రిత్ర‌కు సంబంధించి ఏ పుస్త‌కం వ‌చ్చినా... ఈ ముగ్గురి పేర్లు లేక‌పోతే అది అసంపూర్ణ‌మే కాక అసంబ‌ద్ధ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదంతా గ‌తం... ఇప్పుడు అంతా కాషాయీక‌ర‌ణ దిశ‌గా అడుగులు ప‌డిపోతున్నాయి. ప్ర‌త్యేకించి బీజేపీ పాల‌న‌లోకి వ‌చ్చేసిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అయితే ఈ అడుగుల వేగం మ‌రింత స్పీడందుకుంద‌నే చెప్పాలి. పండిట్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ‌ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని యూపీ వ్యాప్తంగా నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన క్విజ్ పోటీకి సంబంధించి పండిట్ దీన్ ద‌యాళ్ సెంటిన‌రీ సెల‌బ్రేష‌న్స్ క‌మిటీ ఓ పుస్త‌కాన్ని అచ్చు వేయించింది. మొత్తం 70 పేజీలున్న ఈ పుస్త‌కాన్ని ఈ క్విజ్ పోటీలో పాలుపంచుకునేందుకు ఆస‌క్తి చూపే ప్ర‌తి విద్యార్థి చేతిలో పెడ‌తార‌ట‌. ఈ నెల 20న నిర్వ‌హించ‌నున్న ఈ క్విజ్ పోటీలో యూపీ వ్యాప్తంగా ప్ర‌భుత్వ‌ - ప్రైవేట్ పాఠ‌శాల‌ల‌కు చెందిన దాదాపు 15 ల‌క్ష‌ల మంది విద్యార్థులు హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా. యూపీలో అధికార పార్టీగా బీజేపీ ఉన్న నేప‌థ్యంలో ఈ క్విజ్ పోటీని నిర్వ‌హించే విష‌యంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల యంత్రాంగం ఉత్సాహం చూపుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి. అంటే స‌ద‌రు క‌మిటీ రూపొందించిన పుస్త‌కాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌ల విద్యార్థులు దాదాపుగా చ‌దివేయాల్సిందేన‌న్న మాట‌.

అయినా ఓ 70 పేజీలున్న పుస్త‌కానికి సంబంధించి, అది కూడా ఓ సంస్థ అచ్చు వేయించిన పుస్త‌కం గురించి ఇంత‌గా చెప్పుకోవాలా? అన్న అనుమానాలు ఎవ‌రికైనా రావ‌డం స‌హ‌జ‌మే. ఇక ఆ విష‌యంలోకి వెళితే... *ఇండియా ఫ‌స్ట్‌* పేరిట రూపొందిన ఆ పుస్తకంలో మ‌హాత్మా గాంధీ ప్ర‌స్తావ‌న మ‌చ్చుకు కూడా క‌నిపించ‌ద‌ట‌. ఎక్క‌డో ర‌న్నింగ్ లో గాంధీ పేరును ప్ర‌స్తావించినా... భార‌త స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయ‌న పోషించిన పాత్ర‌కు సంబంధించిన వివ‌రాలు పుస్త‌కంలోని ఒక్క పేజీలోనూ క‌నిపించ‌డం లేద‌ట‌. ఇక భార‌త ప్ర‌ప్ర‌థ‌మ ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ ప్ర‌స్తావ‌న కూడా ఆ పుస్త‌కంలో లేద‌ట‌. బాబా సాహెబ్ అంబేద్క‌ర్ ప్ర‌స్తావ‌న ఉన్నా... ఆయ‌న‌ను ఓ ద‌ళిత నేత‌గా కంటే కూడా దేశంలో బ్రాహ్మ‌ణ వాదానికి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పిన నేత‌గానే ఆ పుస్త‌కంలో చూపించార‌ట‌.

మ‌రి గాంధీ, నెహ్రూ, అంబేద్క‌ర్ ప్ర‌స్తావ‌న‌లు లేకుండా ఆ 70 పేజీల పుస్త‌కంలో ఏమేం రాశారంటే... కాషాయ నేత‌లుగా ముద్ర‌ప‌డ్డ పండిట్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ‌, శ్యామ్ ప్ర‌సాద్ ముఖ‌ర్జీ, వీడీ సావ‌ర్క‌ర్‌, ఆరెస్సెస్ వ్య‌వ‌స్థాప‌కుడు కేబీ హెగ్డేవార్‌, జ‌న సంఘ్ నేత నానాజీ దేశ్ ముఖ్ త‌దిత‌రుల పేర్లను మాత్రం ఆ పుస్త‌కంలో ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించార‌ట‌. ఇక దేశాన్ని 330 ఏళ్ల‌కు పైగా పాలించిన మొఘ‌ల్ సామ్రాజ్యాన్ని గానీ, మొఘ‌ల్‌ చ‌క్ర‌వ‌ర్తుల‌కు సంబంధించిన ప్ర‌స్తావ‌న గానీ మ‌చ్చుకైనా ఆ పుస్త‌కంలో క‌నిపించ‌డం లేద‌ట‌. ఇక స్వాతంత్య్ర సంగ్రామంలో పాలుపంచుకున్న ఒక్క ముస్లిం నేత పేరు కూడా ఆ పుస్త‌కంలో లేదట‌. అంటే... ఇన్ని విశేష‌ణాలున్న ఈ  పుస్త‌కం త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా పెను క‌ల‌క‌లానికే తెర లేప‌నుంద‌న్న మాట‌.
Tags:    

Similar News