సెన్సార్ ఓకే చేస్తే ఆపే హ‌క్కు ఎవ‌రికీ లేదంతే!

Update: 2018-04-11 05:38 GMT
సినిమాకు సెన్సార్ చేసిన త‌ర్వాత ఆ సినిమా విడుద‌ల‌ను అడ్డుకునే ప‌వ‌ర్ ఉంటుందా? అన్న అంశంపై అత్యున్న‌త న్యాయ‌స్థానం తాజాగా సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చేసింది. నాన‌క్ షా ఫ‌కీర్ అనే మూవీపై సిక్కుల అత్యున్న‌త మ‌త సంస్థ శిరోమ‌ణి గురుద్వారా ప్ర‌బంద‌క్ క‌మిటీ ఆంక్ష‌లు విధించ‌టంపై కోర్టు త‌ప్పు ప‌ట్టింది. సిక్కు మ‌త స్థాప‌కుడు గురు నాన‌క్ బోధ‌న‌ల ఆధారంగా తీసిన ఈ మూవీ సిక్కుల మ‌నోభావాల్ని దెబ్బ తీసేలా ఉంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

దీని విడుద‌ల‌ను అడ్డుకుంటున్న నేప‌థ్యంలో సినిమా నిర్మాత‌లు కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు ప్రైవేటు వ్య‌క్తులు కానీ సంస్థ‌లు కానీ అడ్డుకోవ‌టం జ‌ర‌గ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

ఇలాంటి ప‌రిణామాలు స్వాగ‌తించ‌లేమ‌ని.. అడ్డుకునే వారిని ప్రోత్స‌హించేలా చేయ‌టం భావ ప్ర‌క‌ట‌న‌స్వేచ్ఛ‌కు విఘాతం క‌లుగుతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. చిత్రం ఎక్క‌డ విడుద‌లైనా.. శాంతిభ‌ద్ర‌త‌లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు ఎలాంటి అవాంత‌రాలు క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కేంద్రానికి.. రాష్ట్రానికి సుప్రీం సూచించింది. ఒక‌సారి సినిమాకు సెన్సార్ బోర్డు స‌ర్టిఫికేట్ ఇచ్చిన త‌ర్వాత  దాన్ని అడ్డుకునే హ‌క్కు మ‌రెవ‌రికీ ఉండ‌ద‌ని తేల్చి చెప్పింది.



Tags:    

Similar News