చట్టం తర్వాత.. ఆ మాటతోనే తెగ పెళ్లిళ్లు చేసేస్తున్నారట

Update: 2022-01-02 05:35 GMT
మోడీ సర్కారు తీసుకొస్తామని చెబుతున్నకొత్త చట్టం.. ఆడ పిల్లల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. చట్టం ఎప్పుడు అవుతుందో తర్వాత.. ముందు అక్కడి వరకు విషయాన్ని ఎందుకు నాన పెట్టాలన్న ధోరణిలో.. అయిన కాడికి తమ పిల్లల పెళ్లిళ్లు చేయిస్తున్న తీరు  ఇప్పుడు ఎక్కువగా సాగుతోంది. ఇప్పటివరకు ఆడ పిల్లలకు వివాహ కనీస వయసు 18 ఏళ్లుగా ఉన్న విషయం తెలిసిందే. దీన్ని 21 ఏళ్లకు పెంచాలన్న ఆలోచనను ఈ మధ్యనే మోడీ సర్కారు వెల్లడించటం తెలిసిందే.

కేంద్రం నోటి నుంచి ఆడ పిల్లల పెళ్లీడు వయసు 21 ఏళ్లకు పెంచేలా చట్టం చేయటానికి అవసరమైన బిల్లును పార్లమెంటులో పెట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తున్న వేళ.. దాన్ని సెలెక్టు కమిటీకిపంపారు. అక్కడ నుంచి బయటకు వచ్చి.. బిల్లు ఆమోదం పొంది.. చట్టంగా మారిన తర్వాత ఫలానా తేదీ నుంచి అమ్మాయిల పెళ్లీడు వయసు అధికారికంగా 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు మారుతుంది. ఇంత ప్రోసీజర్ ఉన్నప్పటికీ.. అవగాహన లేని అమ్మాయిల తల్లిదండ్రులు పలువురు తమ పిల్లలకు హడావుడిగా పెళ్లిళ్లు చేయటం చేస్తున్నారు.

ఈ తరహా పెళ్లిళ్లు హైదరాబాద్ మహానగర శివారుతోపాటు.. హైదరాబాద్ పాతబస్తీలో ఎక్కువగా జరుగుతుండటం గమనార్హం. సాధారణంగా పేద వర్గాల్లోని తల్లిదండ్రులు తమ కుమార్తెలకు త్వరగా పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపాలన్న తొందరలో ఉంటారు. కూతురి పెళ్లి చేస్తే తమ బాధ్యత అయిపోయిందని వారు భావిస్తుంటారు. అందుకేపదహారేళ్లకేపెళ్లి ప్రయత్నాల్ని షురూ చేసి.. పద్దెనిమిదేళ్లకు పెళ్లి తంతు పూర్తి చేస్తారు. మరికొందరు.. తమ సర్టిఫికేట్లు లేని కారణాన్ని ఎత్తి చూపిస్తే.. 16 ఏళ్ల అమ్మాయిని 18ఏళ్ల అమ్మాయి అని చెప్పి పెళ్లిళ్లు చేసే ఉదంతాలు బోలెడన్ని.

కొత్త చట్టంతో చిక్కులు తప్పవని భావిస్తున్న పలువురు ముస్లిం ఆడ పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఇప్పటివరకు 18గా ఉన్న వివాహ వయసు 21 ఏళ్లకు మారితే.. మరో మూడేళ్లు ఇంట్లో ఉంచుకోవటాన్నివారు ఇష్టపడటం లేదు. అందుకే..పెళ్లిళ్లు ఎక్కువగా చేయని కాలంలోనూ.. ఏదోఒక ముహుర్తం చూసి పెళ్లిళ్లు చేస్తుండటం గమనార్హం. డిసెంబరులో మాదార్ నెలగా చెబుతారు. ఈ నెలలో ముస్లింలు పెళ్లిళ్లు చేయటానికి ఇష్టపడరు. అలా అని.. మాదార్ నెలలో పెళ్లిళ్లు చేయకూడదన్న రూల్ కూడా ఏమీ లేదు.

దీంతో.. కొత్త చట్టం వస్తుందన్న భయాందోళనలో ఎప్పుడూ లేని రీతిలో ఈ మాదార్ నెలలో భారీఎత్తున పెళ్లిళ్లు చేసేవారు. ఒక ఖాజీ అయితే.. 12 రోజుల్లో 25 పెళ్లిళ్లు చేసినట్లుగా పేర్కొనటం గమనార్హం. అమ్మాయిల పెళ్లిళ్ల వయసును 21 ఏళ్లకు పెంచుతారు.. అలా జరిగితే తమకు ఇబ్బంది అవుతుందని పేర్కొంటూ ఏదో ఒక సంబంధాన్ని చూసి పెళ్లికి సిద్ధమైపోతున్నారు. ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేయకపోతే సమస్యలు ఎదుర్కొంటామని.. అందుకే పెళ్లిళ్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.

హైదరాబాద్ పాత బస్తీలోని కొన్ని ముస్లిం కుటుంబాల్లో అయితే.. ఒకే ఇంట్లోఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లను పూర్తి చేయటం కనిపిస్తోందని చెబుతున్నారు. మరికొందరు అయితే.. ముందుగా పెళ్లి చేసేసి.. ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధిలో కాపురానికి పంపుతామని వివాహ ఒప్పందాలు చేసుకోవటం గమనార్హం. చట్టం వస్తుందో రాదో తెలీదు కానీ.. ఆ పేరుతో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరుగుతుండటం గమనార్హం.
Tags:    

Similar News