జ‌మ్మ‌ల‌మ‌డుగును ఈ రెడ్డి గారు మ‌రిచిపోవాల్సిందే!

Update: 2021-04-10 02:30 GMT
పొన్న‌పురెడ్డి రామ‌సుబ్బారెడ్డి పేరు వింటేనే.. క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజక‌వ‌ర్గం గుర్తుకు వ‌స్తుంది. అస‌లు జ‌మ్మ‌ల‌మ‌డుగు ప్ర‌స్తావ‌న లేకుండా... రామ‌సుబ్బారెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని చెప్ప‌లేం. అలాంటిది ఇప్పుడు రామ‌సుబ్బారెడ్డికి ఇప్పుడు జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఏమాత్రం ప్రాధాన్యం ల‌భించ‌డం లేదు. అంతేకాదండోయ్‌... అస‌లు ఇక స‌మీప భవిష్య‌త్తుల్లో రామ‌సుబ్బారెడ్డి జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవ‌కాశాలే క‌నిపించ‌డం లేదు. వెర‌సి జ‌మ్మ‌ల‌మ‌డుగులో రామ‌సుబ్బారెడ్డి ప్ర‌స్ధానం ముగిసింద‌న్న వాద‌న‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.

1983లో టీడీపీ ఆవిర్భావం త‌ర్వాత అదే ఏడాదిలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన రామ‌సుబ్బారెడ్డి తండ్రి శివారెడ్డి... ఎన్టీఆర్ ప్ర‌భంజ‌నాన్ని త‌ట్టుకుని విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత టీడీపీలో చేరిన ఆయ‌న వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది... మొత్తంగా వ‌రుస‌పెట్టి మూడు సార్లు జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యేగా రికార్డుల‌కెక్కారు. శివారెడ్డి మ‌ర‌ణానంత‌రం రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసిన రామ‌సుబ్బారెడ్డి కూడా వ‌రుస‌గా రెండు సార్లు టీడీపీ త‌ర‌ఫునే ఎమ్మెల్యేగా విజ‌యం సాధించి జ‌మ్మ‌ల‌మ‌డుగుపై త‌న పట్టు ఏమిటో చూపించారు. 1999లో రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రామ‌సుబ్బారెడ్డికి చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలో చోటు కూడా ద‌క్కింది. అయితే షాద్ న‌గ‌ర్ జంట హ‌త్యల కేసులో దోషిగా తేల‌డంతో రామ‌సుబ్బారెడ్డి రాజ‌కీయ ప్రస్థానం దాదాపుగా ముగిసింద‌నే వార్త‌లు వినిపించాయి. అయితే అందుకు భిన్నంగా జైలు శిక్ష అనుభ‌వించి వ‌చ్చిన త‌ర్వాత కూడా రామ‌సుబ్బారెడ్డి జ‌మ్మ‌ల‌మ‌డుగులో త‌న సత్తా ఏమిటో చూపించారు. ఎమ్మెల్యేగా విజ‌యం సాధించ‌కున్నా... జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఎవ‌రు గెల‌వాల‌న్నా కూడా రామ‌సుబ్బారెడ్డి ప్ర‌మేయం త‌ప్ప‌ద‌న్న రీతిలో ఆ నియోజ‌క‌వ‌ర్గంపై త‌న‌దైన ముద్ర వేశారు.

అయితే మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇటీవ‌లే వైసీపీలో చేరిపోయిన రామ‌సుబ్బారెడ్డి... మొన్న‌టి ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగానే జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి బ‌రిలోకి దిగి ఓట‌మిపాల‌య్యారు. ఆ త‌ర్వాత వైసీపీలోకి చేరిపోయిన ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్యర్థిగా అయినా విజ‌యం సాధించ‌వ‌చ్చులేన‌న్న ధీమాతో ఉన్నారు. అయితే ప్ర‌స్తుతం అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత సుధీర్ రెడ్డి క్ర‌మంగా ఎదుగుతున్నారు. దీంతో యువ‌కుడైన సుధీర్ రెడ్డిని ప‌క్క‌న‌పెట్టేందుకు ఇష్ట‌ప‌డ‌ని వైసీపీ... వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా జ‌మ్మ‌ల‌మ‌డుగులో త‌మ అభ్య‌ర్థి సుధీర్ రెడ్డేన‌ని తేల్చేసింది. అంటే... రామ‌సుబ్బారెడ్డికి వచ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ సీటు ద‌క్కే ఛాన్స్ లేద‌న్న మాటేగా. అయితే రామ‌సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని వైసీపీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు వైసీపీ కీల‌క నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో రామ‌సుబ్బారెడ్డి ఇక‌పై జ‌మ్మ‌ల‌మ‌డుగు సీటు చిక్క‌ద‌నే విశ్లేష‌ణ‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.
Tags:    

Similar News