అంతా ఉత్తుత్తే.. పొత్తు పొత్తే

Update: 2016-08-01 17:30 GMT
ప్రత్యేక హోదాపై పోరు మొదలుపెట్టిన టీడీపీ దాన్ని ఎంతవరకు తీసుకెళ్తుందన్న విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా అంచనాలు వేస్తున్నారు. ఈ ఊపులోనే బీజేపీకి కటీఫ్ చెప్పేస్తారని కొందరు అంటుండగా.. అదేమీ జరగదు - కేంద్రం దిగొస్తుందని.. హోదా ఇవ్వకపోయినా కొంత న్యాయం చేస్తుందని ఆశిస్తున్నారు. అయితే... రాజకీయ లక్షణాలు - అవసరాలు - సమీకరణలు అన్నీ చూసుకుంటే టీడీపీ కూడా బీజేపీతో పొత్తు తెగ్గొట్టే వరకు దీన్నేమీ తీసుకెళ్లదని తెలుస్తోంది. టీడీపీ మాటల యుద్ధం చేతల వరకూ వెళ్లడం అనుమానంగానే ఉంది.  చంద్రబాబు ప్రజాప్రతినిధులు - పార్టీ నేతలతో జరుపుతున్న చర్చల సారాంశాన్ని బట్టి, ఎన్నికల ముందు వరకూ కేంద్రం నుంచి బయటకు రావడం అనుమానమేనన్న విషయం స్పష్టమవుతోంది.

రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేస్తోందన్న ఆరోపణలు ఇదే విధంగా కొనసాగిస్తూనే - మరోవైపు కేంద్రంతో కలసి ఉండాలన్న ద్విముఖ వ్యూహం అనుసరించాలని బాబు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పార్టీవిధానం మేరకు కేంద్రంతో సీరియస్‌గా పోరాడితే అసలుకే ఎసరు వస్తుందన్న భయం మరోవైపు ఎంపీల్లోనూ కనిపిస్తోంది. చాలామంది ఎంపీలకు ఇతర రాష్ట్రాలతోపాటు - ఇతర దేశాల్లోనూ ఎక్కువ వ్యాపారాలున్నాయి. వారిలో పలువురు ఇన్‌ ఫ్రా - పవర్ ప్రాజెక్టు వ్యాపారాలు చేస్తున్నారు. ఇవన్నీ కేంద్రానికి సంబంధించినవే. తెదేపా ఎంపీలలో ముగ్గురు - నలుగురు మినహాయిస్తే మిగిలినవారంతా వ్యాపారవేత్తలే. మోడీతో కొట్లాడితే ఏమవుతుందో వారికి బాగా తెలుసు. కేజ్రీవాల్ అంతటివాడినే మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న మోడీకి తమను తొక్కేయడం ఏమంత కష్టం కాదని వ్యాపారాలు చేస్తున్న ఎంపీల్లో ఆందోళన ఉంది.

దానికితోడు కేంద్రం కేసీఆర్‌ తో సన్నిహితంగా వ్యవహరిస్తుండటం, జగన్ అవకాశం కోసం ఎదురుచూస్తుండటం, కొన్ని కీలకమైన కేసుల దృష్ట్యా ఇప్పుడే కేంద్రం నుంచి బయటకొస్తే కేజ్రీవాల్ మాదిరిగా అధికారం ఉన్నా ఇబ్బందులు పడతామన్న ముందుజాగ్రత్తతో తెదేపా నాయకత్వం వ్యవహరిస్తోంది. కాగా, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల వరకూ వేచిచూడాలన్న ధోరణి కూడా బాబులో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈలోగా, తమ పార్టీ హోదా గురించి ఏమీ చేయడం లేదన్న విమర్శలు రాకుండా, లోక్‌ సభతో పాటు అందుబాటులో ఉన్న అన్ని వేదికలపైనా హోదాపై పోరాడాలని ఆదివారం నాటి ఎంపిల సమావేశంలో నిర్ణయించారు. అందులో భాగంగా, బిజెపితో తాడో పేడో తేల్చుకునేందుకు బాబు సిద్ధంగా ఉన్నారని, మోడీతో భేటీ అయిన తర్వాత అందులో ఇచ్చిన వినతిపత్రాల్లోని అంశాలను పరిష్కరించకపోతే, కేంద్రం నుంచి బయటకు వస్తారన్న ప్రచారం చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీజేపీని విమర్శించిన బాబు - తాము మిత్రధర్మాన్ని పాటిస్తామని చెబుతుండడం కూడా ఇప్పట్లో ఏమీ పొత్తుకు ఢోకా లేదని తెలుస్తోంది.
Tags:    

Similar News