బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల‌కూ.. `పంగ‌నామాలు పెడుతోందా?`

Update: 2021-07-06 12:30 GMT
రెండు తెలుగు రాష్ట్రాల‌కూ బీజేపీ పంగ‌నామాలు పెడుతోందా? .. ఆ పార్టీ వ‌ల్ల రెండు తెలుగు రాష్ట్రాల‌కూ ఎలాంటి ప్ర‌యోజ‌నం లేక‌పోగా.. ఇబ్బందులే కొన‌సాగుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ ప్ర‌భుత్వం.. వ‌రుస‌గా రెండోసారి కూడా విజ‌యం ద‌క్కించుకుని ఇప్పుడు ఏడేళ్లుగా ఏలుతోంది. అయితే.. రాష్ట్ర విభ‌జ‌న కాంగ్రెస్ హ‌యాంలో జ‌రిగింద‌నే కార‌ణ‌మో.. లేక‌.. కాంగ్రెస్ ఏదైనా రాష్ట్రాన్ని విభ‌జ‌న చేస్తే.. ``ఇలానే ఉంటుంది`` అనేలా చూపించాల‌నే రాజ‌కీయ కోణ‌మో.. తెలియ‌దుకానీ.. రెండు తెలుగు రాష్ట్రాల‌ను బీజేపీ ప‌ట్టించుకోవ‌డం లేదు.

నిజానికి కేంద్రంలో మోడీ అధికారంలోకి వ‌స్తే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌స్తుంద‌ని.. తెలంగాణ‌కు అనేక ప్రాజెక్టులు వ‌స్తాయ‌ని.. తెలుగు ప్ర‌జ‌లు భావించారు. 2014లో ఇదే చ‌ర్చ ఎన్నిక‌ల స‌మ‌యంలో జోరుగా సాగింది.కానీ, ఏడేళ్ల‌యినా.. ఏపీకి సంబంధించి ఎలాంటి ప్ర‌యోజ‌నం ద‌క్క‌లేదు. ఉన్న స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించ‌లేదు. ప్ర‌త్యేక హోదాను ఎప్పుడో అట‌కెక్కించారు. పోల‌వ‌రానికి నిధులు ఇచ్చేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కొర్రీలు వేస్తున్నారు. అదేస‌మ‌యంలో కేంద్ర సంస్థ‌ల‌ను ఇస్తామ‌ని ఇచ్చిన విభ‌జ‌న హామీని కూడా అట‌కెక్కించారు.

ఇక్క‌డ మరో చిత్రం ఏంటంటే.. కేంద్ర సంస్థ‌లు ఇవ్వ‌క‌పోగా.. ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటును కూడా అమ్మేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక‌, తెలంగాణ విష‌యాన్ని చూసినా.. ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది. తెలంగాణ‌కు కూడా అనేక ప్రాజెక్టులు విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రావాలి. కానీ.. ఒక్క‌టి కూడా ఇవ్వ‌లేదు. పైగా.. తెలంగాణ‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ అనుస‌రిస్తున్న విధానాన్ని ప్ర‌జ‌లు తిప్పికొడుతున్నారు.  

అయిన‌ప్ప‌టికీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జా ప్ర‌తినిధులు మోడీపై నేరుగా ఏమీ అన‌లేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. వారిపై ఉన్న కేసులు లేదా.. రాజ‌కీయ వ్య‌వ‌హారం.. ఏదైనా కావొచ్చు.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిని ప్ర‌శ్నించ‌లేక పోతున్నారు. ప‌లితంగా రెండు తెలుగు రాష్ట్రాల‌కు మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వం.. ప‌క్కాగా పంగ‌నామాలు పెడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 
Tags:    

Similar News