నామినేషన్లో డినామినేషన్

Update: 2016-04-23 08:01 GMT
ఎన్నికలంటేనే విచిత్రాలు... వింతలు.. వినోదాలు.. విశేషాల సమాహారం. అందరిలో గుర్తింపు పొందడానికి, పబ్లిసిటీ కోసం చాలామంది అభ్యర్థులు సరదాసరదా పనులు చేస్తుంటారు. సెంటిమెంట్లతోనూ ఆకట్టుకుంటారు. తాజాగా తమిళనాడులో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా అలాంటి పనే చేశాడు. ఆయన దెబ్బకు ఎన్నికల అధికారుల జబ్బలు నొప్పులు పుట్టాయి.  

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ ఘట్టం శుక్రవారం ఆరంభమైంది. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి డిపాజిట్టుగా రూ.10వేలు చెల్లించాల్సి ఉంది. చెన్నై విల్లివాక్కం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కందస్వామి షెనాయ్‌నగర్‌లోని ఎన్నికల కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. అయితే... నామినేషన్ సందర్భంగా ఆయన చెల్లించాల్సిన రూ.10వేల డిపాజిట్టు మొత్తాన్ని పూర్తిగా చిల్లర రూపంలో ఇచ్చాడు. అన్నీ రూ.10 నాణేలను తీసుకొచ్చి ఎన్నికల అధికారులకు ఇచ్చాడు.  7 కిలోలకు పైగా బరువున్న  నాణేలను ఎన్నికల అధికారి కుమారవేల్‌ కు అందజేశారు. సదరు అధికారి తన సహాయక సిబ్బందికి ఆ నాణేలను సరిచూడాల్సిందిగా కోరారు. లెక్క సరిపోవడంతో నామినేషన్‌ను స్వీకరిం చి అభ్యర్థిని పంపివేశారు. ఆ లెక్క సరిపోయిందని చెప్పడానికి వారు మాత్రం అరగంటకు పైగా లెక్క పెట్టాల్సివచ్చిందట.

అయితే... అభ్యర్థి కందస్వామి మాత్రం ఆ నాణేల వెనుక కథ చెప్పడంతో అందరూ ఆయన పట్ల సానుభూతి చూపారు. ప్రజాసేవ చేసేందుకే ఎన్నికల్లో పోటీచేస్తున్నాని, డిపాజిట్టు కట్టడానికి డబ్బుల్లేకపోవడంతో స్నేహితులు, బంధువులను ఆశ్రయించగా వారి నుంచి చందాలుగా అందిన నాణేలను అధికారికి సమర్పించానని తెలిపారు. డిపాజిట్టు కట్టడానికి డబ్బుల్లేకపోయినా ప్రజాసేవపై ఆయనకు ఉన్న ఇష్టాన్ని చూసి అంతా ముచ్చటపడుతున్నారు. మరి ఓట్లేస్తారో లేదో మాత్రం తెలియదు. ఇంతకీ నాణేలు ఇచ్చినవారైనా ఓట్లేస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News