యోగీ ఎఫెక్ట్‌!... ఐఏఎస్‌ లకు ముక్క లేదు!

Update: 2017-12-15 12:16 GMT
యోగీ ఆదిత్య‌నాథ్... అస‌లు సిస‌లైన యోగీనే. హిందూత్వ వాదాన్ని న‌ర‌నరాన ఒంట‌బ‌ట్టించేసుకున్న ఈ బీజేపీ ఎంపీకి... మొన్న‌టి యూపీ ఎన్నిక‌ల్లో అనూహ్యంగా ఆ రాష్ట్ర సీఎం ప‌ద‌వి ద‌క్కేసింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చ‌ల‌వ‌తో ఎంపీ ప‌ద‌విని వ‌దిలేసిన ఆదిత్య‌నాథ్... ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. రామ మందిరం వివాదం నేప‌థ్యంలో ఆదిత్య‌నాథ్ యూపీ సీఎంగా ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గానే.. ఆ వివాదం ఎంత కీల‌క మ‌లుపు తీసుకుంటుందోన‌న్న భావ‌న వ్య‌క్త‌మైనా... వివాదం మొత్తానికి దారికి వ‌స్తున్న‌ట్లుగానే ఉంది. సిస‌లైన యోగీగానే యూపీ ప్ర‌జ‌ల‌కు తెలిసిన యోగీ.. సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గానే... యూపీలో హిందూత్వ వాదానికి కొత్త ఊపిరి వ‌చ్చేసిన‌ట్టుగా అంతా భావించారు. ఆ దిశ‌గా ఆదిత్య‌నాథ్ చాలా కీల‌క నిర్ణ‌యాలే తీసుకున్నారు. ఇక పాల‌నాప‌రంగా కూడా యోగీ చాలా స్పీడుగానే కాకుండా క్లియ‌ర్ క‌ట్ అయిన నిర్ణ‌యాల‌తో దూకుడుగా సాగుతున్నారు. ఇంత‌దాకా బాగానే ఉన్నా... యోగీ పాల‌నా సంస్క‌ర‌ణ‌ల‌తో యూపీ కేడ‌ర్ సివిల్ స‌ర్వెంట్ల‌కు కొత్త ఊపిరి కూడా వ‌చ్చేసింద‌న్న వాద‌న వినిపించింది. ప్ర‌జ‌ల‌కు మేలు చేసే నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో త‌మ‌కు కాస్తంత వెసులుబాటు ల‌భించింద‌ని కూడా అక్క‌డి ఐఏఎస్‌లు చాలా సంతోషం వ్య‌క్తం చేశారు కూడా.

అయితే ఆ సంతోషం కాస్త ఆవిర‌య్యే ప‌రిస్థితులు ఎదురు కావ‌డంతో ఇప్పుడు అక్క‌డి ఐఏఎస్‌లు క‌క్క‌లేక మింగ‌లేక నానా ఇబ్బంది ప‌డుతున్నార‌ట‌. అయినా పాల‌న‌లో అధికారుల‌కు స్వేచ్ఛ ఇచ్చిన సీఎంతో ఐఏఎస్‌ల‌కు మంచే జ‌రుగుతుంది క‌దా? ఇబ్బందేమిట‌న్న విష‌యానికి వ‌స్తే... యోగీ కార‌ణంగా త‌మ‌కు స్వేచ్ఛ ల‌భించినా... ఒక్క విష‌యంలో మాత్రం త‌మ‌కు తీర‌ని అన్యాయం జ‌రిగిపోతోంద‌ని అక్క‌డి ఐఏఎస్‌లు లోలోప‌లే మ‌ధ‌న‌ప‌డిపోతున్నారు. ఆ క‌థాక‌మామీషు ఏమిటో చూద్దామా?  యూపీ కేడ‌ర్ ఐఏఎస్‌లు ఏటా త‌మ స‌ర్వీసు అధికారులంద‌రితో క‌లిసి వీకెండ్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకుంటార‌ట‌. ఇదేదో ఇప్పుడు మొద‌లెట్టిన కార్య‌క్ర‌మ‌మేమీ కూడా కాద‌ట‌. మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్ ఉండ‌గా... ఈ కార్య‌క్ర‌మాన్ని ఐఏఎస్‌లు చాలా గ్రాండ్‌గా జ‌రుపుకున్నార‌ట‌. ఈ కార్య‌క్ర‌మంలో నోరూరించే నాన్ వెజ్ ఐటెంల‌తో ఐఏఎస్‌లు ఎంజాయ్ చేయ‌డ‌మే కాకుండా అఖిలేశ్ తో క‌లిసి క్రికెట్ కూడా ఆడారు. దానిని నేష‌న‌ల్ మీడియా కూడా బాగానే హైలెట్ చేసింది. అఖిలేశ్ కంటే కూడా త‌మ‌కు స్వేచ్ఛనిచ్చిన యోగీ సీఎంగా రావ‌డంతో మ‌రింత జోష్ గా ఈ ఏడాది వారు వీకెండ్‌ ను నిర్వ‌హించుకోవాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ట‌. ఈ కార్య‌క్ర‌మానికి యోగీని పిల‌వ‌డంతో అందులో పాలుపంచుకునేందుకు యోగీ కూడా ఓకే చెప్పేశార‌ట‌.

ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య వ‌చ్చింద‌ని ఐఏఎస్‌లు లోలోప‌లే మ‌థ‌న‌ప‌డిపోతున్నారు. నిన్న ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మంలో ఏటా క‌నిపించే మ‌ట‌న్‌, చికెన్‌, ఫిష్ ముక్క‌లు అస్స‌లు క‌నిపించ‌లేద‌ట‌. అదేంటీ... ఇలాంటి కార్య‌క్ర‌మాల సంద‌ర్భంగా అఖిల భార‌త స‌ర్వీసుల‌కు చెందిన అధికారులు నాన్ వెజ్ ఐటెంల‌తో మ‌స్తు మ‌జా చేస్తారు క‌దా అంటే... మామూలుగా అయితే అదే జ‌రిగేది. యోగీ వ‌స్తున్నారు క‌దా... నాన్ వెజ్ వాస‌న‌లు అస్స‌లే గిట్టని యోగీ వ‌స్తే... ఆయ‌న‌కు ఆ వాస‌న‌లు త‌గిలితే... ఎక్క‌డ ఇబ్బంది వ‌స్తుందోన‌న్న భ‌యంతో నిర్వాహ‌కులు నాన్ వెజ్‌కు నో చెప్పేశార‌ట‌. అంతా ఆకు కూర‌లు, కాయ‌గూర‌ల‌తో వంట‌లు సిద్ధం చేసుకోవాల్సి వ‌చ్చింది. నిజ‌మే మ‌రి... సిసైన యోగీగా ఉన్న ఆదిత్య‌నాథ్ కు నాన్ వెజ్ వాస‌న‌లు ప‌డ‌వు క‌దా. అందుకే అక్క‌డ నాన్ వెజ్ అన్న వాస‌నే క‌నిపించ‌లేద‌ట‌. నిన్న‌టి కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత... మ‌ట‌న్ అంటే ఎంతో ఇష్ట‌ప‌డే ఓ సీనియ‌ర్ ఐఏఎస్ త‌న మ‌న‌సులోని బాధ‌ను మీడియా ముందే విప్పేశార‌ట‌. యోగీ కార‌ణంగా తాము కూడా ఆయ‌న‌లాగే వెజిటేరియ‌న్లుగా మారిపోవాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న వాపోయార‌ట‌. మ‌రి ఈ విష‌యం యోగీకి తెలిసిందో, లేదో గానీ... ఐఏఎస్‌లు మాత్రం మ‌ట‌న్ ముక్క లేక దిగాలుగా కార్య‌క్ర‌మాన్ని చ‌డీ చ‌ప్పుడు లేకుండా జ‌రిపించేశార‌ట‌.
Tags:    

Similar News