అప్పిచ్చేందుకు బ్యాంకులు రెడీ..తీసుకునేవారేరీ?

Update: 2018-05-16 07:40 GMT
ఔను. బ్యాంకులు అప్పిస్తామంటుంటే...సామాన్యులు - వివిధ సంస్థ‌లు వ‌ద్దు బాబోయ్ అంటున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాక బ్యాంక‌ర్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇది మ‌రో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందా? అంటూ టెన్ష‌న్ అవుతున్నారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఈ ట్రెండ్‌ లో మ‌న ద‌క్షిణాది రాష్ట్రాలు మ‌రింత టాప్‌ లో ఉండ‌టం గ‌మ‌నార్హం. బ్యాంకుల వద్దకు కోట్లాది రూపాయల డిపాజిట్లు వచ్చి చేరుతున్నప్పటికీ.. రుణాలు తీసుకొనేవారు మాత్రం తగ్గిపోతున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా ఆర్‌బీఐ విడుద‌ల చేసిన లెక్క‌ల ప్రకారం 2014-17 మధ్య కాలంలో దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలలో 17 రాష్ట్రాల్లో డిపాజిట్లు-రుణాల నిష్పత్తి భారీగా పడిపోయింది. దేశంలో 2017 మార్చి ముగింపు నాటికి రిజర్వు బ్యాంక్‌ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం మేరకు దాదాపు 157 కోట్ల బ్యాంక్‌ ఖాతాలు ఉన్నాయి. దేశంలోని వయోజన జనాభాలో మొత్తం 80 శాతం మంది వరకు బ్యాంక్‌ ఖాతాలను కలిగి ఉన్నారు. వీరు బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో దాచుకున్న మొత్తం రూ.107.3 లక్షల కోట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తం నుంచి వాణిజ్య బ్యాంకుల రుణాల రూపంలో రాష్ట్రాలకు అందించిన మొత్తం కేవలం రూ.79.1 లక్షల కోట్లుగానే నమోదు అయింది.

ఈ చిత్ర‌మైన స‌మ‌స్య‌కు కార‌ణం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తీసుకున్న నిర్ణ‌య‌మే. 2011లో మొత్తం జనాభాలో బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న వారి సంఖ్య 35 శాతం కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టే నాటికి ఈ సంఖ్య 2014 నాటికి 53 శాతానికి పెరిగింది. అప్పటికి బ్యాంకుల్లో డిపాజిట్ల మొత్తం రూ.80 లక్షల కోట్లుగా ఉంది. 2017 మార్చి ముగింపు నాటికి ఈ మొత్తం 34 శాతం వృద్ధి రూ.107.3 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో 2014లో రూ.62.8 లక్షల కోట్లుగా ఉన్న రుణాల వితరణ.. 2017 మార్చి నాటికి రూ.79.2 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే డిపాజిట్లలో 34 శాతం వృద్ధి కనిపిస్తే.. రుణాల వితరణలో మాత్రం వృద్ధి 26 శాతానికే పరిమితం అయింది. దేశంలోని మొత్తం ఆరు ప్రాంతాల్లోకి నాలుగు ప్రాంతాల్లో క్రెడిట్‌ డిపాజిట్‌ నిష్పత్తి త‌గ్గిపోయింది.

మ‌రోవైపు ద‌క్షిణాది రాష్ర్టాలు ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. దక్షిణ భారతంలో ఆయా రాష్ట్రాల నుంచి బ్యాంకులు డిపాజిట్ల రూపంలో సమీకరించిన మొత్తాన్ని.. వాణిజ్య బ్యాంకులు తిరిగి రుణాల రూపంలో అందించిన మొత్తాన్ని సరితూచి చూస్తే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 2017 దక్షిణాదిలో అత్యధికంగా కర్ణాటక రూ.7.8 లక్షల కోట్లు - తమిళనాడు రూ.6.6 లక్షల కోట్లు - తెలంగాణ - కేరళా రాష్ట్రాలు సంయుక్తంగా రూ.4 లక్షల కోట్ల మేర సొమ్మును డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లో జమ చేయగా.. రుణాల రూపంలో తమిళనాడుకు రూ.7 లక్షల కోట్లు - కర్ణాటకకు రూ.5.2 లక్షల కోట్లు - ఆంధ్రప్రదేశ్‌ కు రూ.2.5 లక్షల కోట్లు - తెలంగాణలకు రూ.3.9 లక్షల కోట్ల రుణాలు అందాయి. దక్షిణాదిన ఢిల్లీ డిపాజిట్ల విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. దాదాపు రూ.11 లక్షల కోట్ల డిపాజిట్లతో ఈ ప్రాంతం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానాల్లో పంజాబ్‌ రూ.3.3 లక్షల కోట్లు - రాజస్థాన్‌ రూ.3.1 లక్షల కోట్ల మేర బ్యాంక్‌ డిపాజిట్లు జరిపినట్టుగా ఆర్‌ బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ప్రతిగా ఢిల్లీ ప్రాంతంలో రూ.9.6 లక్షల కోట్లు - పంజాబ్‌ రూ.2.2 లక్షల కోట్లు - రాజస్థాన్‌ రూ.2.1 లక్షల కోట్ల మేర రుణాలను బ్యాంకుల ఆయా రాష్ట్రాల్లో అందజేశాయి.

ఈ ప‌రిణామం మ‌ళ్లీ బ్యాంకుల పుట్టి మునిగేందుకు కార‌ణం అవుతుంద‌ని ప‌లువురు ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు. బ్యాంకులకు వచ్చే డిపాజిట్లకు.. ఆయా విత్త సంస్థలు ఇచ్చే రుణాలకు మధ్య అంతరం చాలా దేశాల్లో స్వల్పంగా ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో మోడీ సర్కారు ఆధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన నోట్ల రద్దు - జీఎస్టీ వంటి విపత్కర సంస్కరణలు - ఆర్థిక వ్యవస్థలో మందగమనం కారణంగా.. ఆర్థిక కార్యకాలాపాలు కుదేలయ్యాయి. దీంతో డిమాండ్‌ లేక కొత్తగా ఉత్పత్తిని చేపట్టేందుకు పరిశ్రమలుగానీ.. సంస్థలు గాని ముందుకు రావడం లేదు. ఫలితంగా బ్యాంకుల వద్ద లక్షల కోట్లు రుణ డిమాండ్‌ మూలుగుతున్నాయి. ఇది బ్యాంకుల మనుగడకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. రుణాల వితరణ పెద్దగా లేకున్నప్పటికీ బ్యాంకుల్లో సొమ్ము దాచుకున్న వారికి తప్పక వడ్డీ చెల్లించాల్సి పరిస్థితి నెలకొంది. దీంతో బ్యాంకులు మరింత నష్టాల్లోకి జారుకుంటున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. ఇది మ‌రిన్ని బ్యాంకులు దివాళ తీసేందుకు కార‌ణం అవుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News