ఆ దేశ ప్రధాని మాట వింటే దిమ్మ తిరగాల్సిందే

Update: 2016-10-06 09:25 GMT
తప్పులు చేస్తూ అడ్డదిడ్డంగా సమర్థించుకునే రాజకీయ నేతలు మనకు మామూలే. వారు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తే.. ఏ మాత్రం ఆలోచించకుండా మాటల దాడి చేసే మన నేతల్ని చూసిన ప్రతిసారీ.. ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిసస్తుంటారని ఆవేదన చెందుతాం. ఇక.. ఈ తరహా రాజకీయ నేతలు కీలక స్థానాల్లో ఉంటే వారిపై తరచూ విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెట్టటం మామూలే. అయితే.. నార్వే ప్రధాని గురించి తెలిసినప్పుడు మాత్రం మన నేతలే చాలా బెటర్ అన్న భావన కలగటం ఖాయం.

తప్పు చేసి.. అడ్డంగా బుక్ అయిన తర్వాత బుకాయింటమే కాదు.. ఎదురుదాడి చేసే తీరు చూస్తే విస్మయం చెందాల్సిందే. ఈ ముదురు ప్రధాని విషయంలోకి వెళితే.. నార్వే ప్రధాని ఎర్నా సోల్ బర్గ్. ఆమెకు మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవటం మహా సరదా. నిజానికి అలా ఆడుకోవటం తప్పేం కాదు. కాకుంటే.. సీరియస్ గా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ.. ఆమె అలాంటి వాటిని పట్టించుకోకుండా తనకెంతో ఇష్టమైన పోకెమాన్ గో ఆడుతూ కూర్చోవటం ఇప్పుడు వివాదంగా మారింది.

ఓ పక్క సీరియస్ గా చర్చలు సాగుతుంటే.. ప్రధాని మాత్రం ఆన్ లైన్ గేమ్ ఆడుకోవటంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని స్థానంలో ఉన్న నేత పార్లమెంటు సమావేశాల్లో ఆడుకోవటం ఏమిటంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. వాటిని లైట్ తీసుకున్న ఆమె చాలా సింపుల్ తీసిపారేస్తూ.. తన మెదడు పని చేస్తూ ఉంటుందని.. అది అందరి మాటల్ని వింటూ ఉంటుంద‌ని చెప్పేశారు.

బుకాయించటం.. తప్పు చేసినప్పుడు అడ్డదిడ్డంగా మాట్లాడటం మన నేతలకు అలవాటే కానీ.. ఈ స్థాయిలో మాట్లాడటం మాత్రం కనిపించదు. అందుకు భిన్నంగా నార్వే ప్రధాని మాటలు విన్న అక్కడి వారు ఆమె తీరుపై మండిపడుతున్నారు. పార్లమెంటు సమావేశాల్లోనే కాదు.. కీలకమైన విదేశీ పర్యటనల్లోనూ మొబైల్ గేములు ఆడుకోవటం ఆమెకు అలవాటని చెబుతారు. దీంతో.. పోలిస్తే.. మన ప్రధాని.. మన ముఖ్యమంత్రులు చాలా బెటరేమో కదూ..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News