అక్కడ సెకండ్ ప్లేస్ లో నోటా.. సేనకు తీరని అవమానం

Update: 2019-10-25 07:07 GMT
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి విజయాన్ని సాధించినప్పటికీ.. ఆ రెండు పార్టీలకు విజయానందం పూర్తిగా దక్కని పరిస్థితి. రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీని సాధించినప్పటికీ.. ఆ రెండు పార్టీలకు వేర్వేరు కారణాలతో గెలుపును పూర్తిస్థాయిలో అస్వాదించలేని పరిస్థితి. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ దాదాపు ఇరవైకి పైగా సీట్లు తగ్గిపోయి షాక్ లో ఉండిపోతే.. శివసేనకు కొన్ని చోట్ల ఎదురైన పరాభవాలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి.

లాతూరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం ఇందుకు పెద్ద ఉదాహరణగా చెప్పాలి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్ రావ్ దేశ్ ముఖ్ కుమారుల్లో ఒకరైన ధీరజ్ దేశ్ ముఖ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి అపూర్వ విజయాన్ని సాధించారు. ఈ స్థానం నుంచి ధీరజ్ కు ఏకంగా 1.3లక్షల మెజార్టీ లభించటం విశేషం.

ఇదిలా ఉంటే.. రెండో స్థానంలో నోటా నిలవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఎన్నికలు ఎక్కడ జరిగినా నోటాకు వచ్చే ఓట్లు ఐదు వేలకు మించి దాటని పరిస్థితి. అరుదుగానే అంతకంటే ఎక్కువగా వచ్చే పరిస్థితి. అలాంటిది లాతూర్ గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గంలో నోటాకు ఏకంగా 27,500 ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లలో ఏకంగా 13.78శాతం ఓట్లు రావటం విశేసం.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ధీరజ్ దేశ్ ముఖ్ కు రాజకీయంగా ప్రత్యర్థి అయిన శివసేన అభ్యర్థి సచిన్ దేశ్ ముఖ్ మూడో స్థానంలో నిలిచారు. పెద్ద ఎత్తున సీట్లను సాధించిన శివసేన లాతూర్ గ్రామీణంలో మాత్రం నోటా కంటే తక్కువ ఓట్లు రావటం ఆ పార్టీకి ఎదురైన దారుణ పరాభవంగా అభివర్ణిస్తున్నారు.
Tags:    

Similar News