ఏపీకి ఆక్టోపస్ బలగాలు..లాక్ డౌన్ మరింత కట్టుదిట్టం!

Update: 2020-04-07 12:10 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 304 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా కేసుల్లో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఈ నేప‌థ్యంలోనే అమ‌రావ‌తి ప్రాంతాల్లో లాక్‌ డౌన్ మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం గ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్రమంలోనే మూడంచెల వ్యూహం అమ‌లు చేస్తోంది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కోరలు చాచుతున్న వేల అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ ను మరింత కఠినతరం చేయాలనీ భావించి అత్యంత క్లిష్ట సమయాలలో మాత్రమే రంగ ప్రవేశం చేసే ఆక్టోపస్ బృందాన్ని గుంటూరు కు రప్పించినట్టు పోలీసు ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో 4 ప్లాటూన్ ల ఏపీఎస్పీ బలగాలను వినియోగిస్తున్నట్టు చెప్పారు. ఆయా ప్రాంతాలలో విధి నిర్వహణ చేస్తున్న సిబ్బంది విషయంలో పూర్తి జాగ్రత్తలు పాటిస్తున్నట్టుగా తెలిపారు. రాష్ట్ర డీజీపి ఉద్యోగుల భద్రత విషయంలో వారికి అందించాల్సిన పరికరాలు, పాటించాల్సిన జాగ్రత్త‌ల‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న‌ట్లు చెప్పారు.

లాక్‌ డౌన్‌ నిబంధనలు పటిష్టంగా అమలయ్యేందుకు మూడంచెల భద్రత తో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మొదటి దశలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల ద్వారా అత్యవసర సర్వీసులు మినహాయించి గుంటూరు నగరానికి బయట ప్రపంచానికి ఎటువంటి సంబంధం లేకుండా చేసారు. రెండవ దశలో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి కాంటైన్మెంట్‌ ప్రాంతాలలో రాకపోకలు పూర్తిగా నియంత్రించారు. మూడవ దశలో కాంటైన్మెంట్‌ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల్లో జనసంచారం పూర్తిగా నిషేధించిన‌ట్లుగా వివరించారు. నిత్యావసరాలు - పాలు, -పండ్లు - కూరగాయలు కొనుగోలు చేసే నిమిత్తం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఇచ్చిన వెసులుబాటు ను దుర్వినియోగం చేయవద్దని కోరుతున్నారు. ఆ సమయంలో ప్రజలంతా వారు నివసించే ప్రాంతానికి 1 లేదా 2 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే వాటిని సమకూర్చుకోవాలని చెబుతున్నారు.
Tags:    

Similar News