హాట్ టాపిక్: ఏపీ మంత్రికి ఆక్టోపస్ సెక్యూరిటీ

Update: 2018-11-27 15:26 GMT
ఆంధ్రప్రదేశ్ కేబినేట్లో స్థానం సంపాదించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన కిడారి శ్రావణ్‌ కుమార్‌ కు ప్రభుత్వం భారీ భద్రత కేటాయించింది. శ్రావణ్ కు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ బుల్లెట్‌ ప్రూఫ్‌ ఫార్చూనర్‌ వాహనంతోపాటు ఆక్టోపస్‌ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.  రాష్ట్ర మంత్రివర్గంలో ఆక్టోపస్‌ భద్రత కలిగిన ఏకైక మంత్రి శ్రావణ్‌ మాత్రమే. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేసిన నేపథ్యంలో ఆయన కుమారుడు శ్రావణ్‌కుమార్‌ను సీఎం చంద్రబాబు ఇటీవల మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

 శ్రావణ్‌ తరచూ ఏజెన్సీకి వెళ్లాల్సి వుండడం వల్ల మావోయిస్టుల నుంచి ఎలాంటి ముప్పు లేకుండా వుండేందుకు ముందు జాగ్రత్తగా భద్రతను పటిష్ఠం చేసింది. ఆక్టోపస్‌ బలగాలను వ్యక్తిగత భద్రతకు వినియోగించడం ఇదే తొలిసారి. శ్రావణ్ కుమార్ కు కూడా మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం ఉండటంతో ప్రభుత్వం అతడికి ఈ స్థాయి భారీ భద్రత కల్పించింది. ఐతే ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా మంత్రి పదవి చేసిన వ్యక్తికి కనీ వినీ ఎరుగని స్థాయిలో ఇంత సెక్యూరిటీ ఇవ్వడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. కానీ శ్రావణ్ తండ్రికి జరిగిన ఘోరం దృష్టిలో ఉంచుకుని చూస్తే ఈ నిర్ణయం అర్థం చేసుకోదగ్గదే.
Tags:    

Similar News